అది రాజకీయ ప్రచారమే!

11 Aug, 2017 01:14 IST|Sakshi
అది రాజకీయ ప్రచారమే!

► మైనారిటీల అభద్రతపై వెంకయ్య నాయుడు
► భారతీయుల రక్తంలోనే లౌకికవాదముంది
► పరోక్షంగా అన్సారీకి చురకలు
► నేడు ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం


న్యూఢిల్లీ: దేశంలో మైనారిటీలు అభద్రతా భావంలో ఉన్నారన్న వ్యాఖ్యలను కాబోయే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖండించారు. మైనారిటీల్లో ఇలాంటి భావమే లేదని.. రాజకీయ ప్రచారం కోసమే కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ వ్యాఖ్యలను పరోక్షంగా తోసిపుచ్చారు. ‘భారత్‌లో మైనారిటీలు అభద్రతతో ఉన్నారని కొందరంటున్నారు. ఇది రాజకీయ ప్రచారమే. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లోనే మైనారిటీలు భద్రంగా ఉన్నారు. వారి హక్కులను పొందుతున్నారు.

దేశంలో అసహనం పెరుగుతోందన్నది అవాస్తవం. ఇక్కడి నాగరికత ప్రభావం కారణంగా భారత సమాజం చాలా సహనశీలమైనది’ అని వెంకయ్య గురువారం ఢిల్లీలో పేర్కొన్నారు. దేశంలో సహనం ఉన్నందునే ప్రజాస్వామ్యం విజయవంతంగా నడుస్తోందన్నారు. అయితే మతం పేరుతో ఎవరిపైన దాడి జరిగినా దాన్ని సహించే ప్రసక్తే లేదన్నారు. అన్సారీ వ్యాఖ్యలపై వీహెచ్‌పీ మండిపడింది. ముస్లింల అభద్రతపై మాట్లాడి మహ్మద్‌ అలీజిన్నా మార్గంలో అన్సారీ నడుస్తున్నారని వీహెచ్‌పీ జాతీయ సహకార్యదర్శి సురేంద్ర జైన్‌ విమర్శించారు. అన్సారీ ఉపరాష్ట్రపతి పదవికి అవమానం చేశారన్నారు.

నేడు వెంకయ్య ప్రమాణ స్వీకారం
ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం రాజ్యసభ చైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా గురువారం పీటీఐ వార్తాసంస్థతో వెంకయ్య మాట్లాడుతూ.. చట్టాలను సమర్థవంతంగా అమలుచేయటం, రాజ్యసభను సజావుగా నడిపించటంలో ఎంపీల సహకారం తీసుకుంటానని ఆయన తెలిపారు. ‘పార్లమెంటు సజావుగా, అర్థవంతంగా నడవడంలో మనం మరింత పరిణతితో వ్యవహరించాలి. చైర్మన్‌ సభను నడిపే వ్యక్తి మాత్రమే కాదు.. సభ్యుల హక్కులకు సంరక్షకుడు కూడా’ అని వెంకయ్య పేర్కొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు