'టీడీపీ ఎంపీ చర్య నిజంగా సిగ్గుచేటు'

16 Jun, 2017 09:59 IST|Sakshi
'టీడీపీ ఎంపీ చర్య నిజంగా సిగ్గుచేటు'

న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందితో గురువారం దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. జేసీ దివాకర్‌రెడ్డి తీరుపై సివిల్ ఏవియేషన్ మాజీ డైరెక్టర్ జనరల్ కాను గోహైన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిర్ లైన్స్ సిబ్బందిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడటం నిజంగా సిగ్గుచేటన్నారు. సెక్యూరిటీ నియమాలను జేసీ ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఎంపీలు తమ హద్దుల్లో ఉంటూ హుందాగా ప్రవర్తించాలని మాజీ డీజీసీఏ హితవు పలికారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రకటించించిన వెంటనే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, స్పైస్‌జెట్, గో ఎయిర్, జెట్‌ఎయిర్‌వేస్‌లు కూడా జేసీపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఇండిగో విమానంలో బెంగళూరుకు వెళ్లేందుకు గురువారం ఉదయం దివాకర్‌రెడ్డి 7.30 గంటలకు ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ బిల్డింగ్‌లోకిð వెళ్లారు. ఆయన వెళ్లే విమానం 7.55 గంటలకు బయలుదేరనుంది. అయితే బోర్డింగ్ పాస్ ఇవ్వాలని కౌంటర్‌లో సిబ్బందిని అడగగా.. విమానం బయలుదేరే సమయానికి 45 నిమిషాల ముందే బోర్డింగ్ పాసులు జారీ చేశామని, ఆ సమయం దాటిన తర్వాత వచ్చిన వారికి ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని చెప్పారు. తనకే రూల్స్ చెబుతారా అంటూ కౌంటర్లోకి చొరబడి ఓ ఉద్యోగిని మెడ పట్టుకుని గెంటేయడంతో పాటు బోర్డింగ్‌ పాస్‌లు జారీచేసే మెషీన్‌ను టీడీపీ ఎంపీ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు.

ఆ సమయంలో వీఐపీ లాంజ్‌లో ఉన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వద్దకు వెళ్లి విమాన సిబ్బంది తనన అవమానించారని చెప్పారు. కేంద్ర మంత్రి విమాన సంస్థ అధికారులను ఒప్పించి బోర్డింగ్‌పాస్‌ ఇప్పించగా, ఇతర ప్రయాణికులకు అలాగే బోర్డింగ్ పాస్‌లు ఇవ్వవ పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గన్నవరం విమానాశ్రయంలోనూ ఎంపీ జేసీ ఇదే తరహాలో దాడులకు తెగబడ్డారనీ, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర ఎంపీ గైక్వాడ్ విషయంలో వ్యవహరించినట్లుగానే జేసీపైనా చర్యలు తీసుకోవాలని విమానయాన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు