మాజీ సీఎం అల్లుడు అదృశ్యం

30 Jul, 2019 08:39 IST|Sakshi

మంగళూరు : కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు, కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ అదృశ్యమయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. అయితే సిద్దార్థ దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్‌ బ్రిడ్జిపై నుంచి నేత్రావతి నదిలోకి దూకి ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. అతని డ్రైవర్‌ చెప్పిన కథనం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఉంది. దీంతో పోలీసులు నదిలో బోట్ల సాయంతో గాలింపు చేపట్టారు. అయితే గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో భారీగా నీటి ప్రవాహం ఉంది. దీంతో పోలీసుల గాలింపుకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు సిద్దార్థ ఆచూకీ లభించలేదు. మరోవైపు అతని ఫోన్‌ కూడా అందుబాటులో లేనట్టుగా తెలుస్తోంది.

ఈ ఘటనపై ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. ‘సిద్దార్థ సోమవారం బెంగళూరు నుంచి సకలేశ్‌పూర్‌కు కారులో బయలుదేరారు. కానీ డ్రైవర్‌ను మంగళూరుకు పోనివ్వమన్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఉల్లాల్‌ బ్రిడ్జ్‌ వద్దకు తీసుకెళ్లమని డ్రైవర్‌కు తెలిపాడు. అయితే సాయంత్రం ఏడు గంటల సమయంలో బ్రిడ్జి సమీపంలో కారును పార్క్‌ చేయమని డ్రైవర్‌కు చెప్పిన సిద్దార్థ.. తాను బ్రిడ్జిపై వాకింగ్‌కు వెళ్తున్నట్టు చెప్పాడు. చాలా సేపయిన సిద్దార్థ తిరిగి రాకపోవడంతో డ్రైవర్‌ అతని కుటుంబసభ్యులకు, పోలీసులకు ఈ సమాచారం అందించాడ’ని తెలిపారు.

ఈ విషయం తెలిసుకున్న కర్ణాటక సీఎం యడియూరప్ప, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డీకే శివకుమార్‌, బీఎల్‌ శంకర్‌లు బెంగళూరులోని ఎస్‌ఎం కృష్ణ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు సిద్దార్థ ఆచూకీ కోసం నేత్రావతి నదిలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు 200 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. అలాగే స్థానిక మత్య్సకారుల సాయం కూడా తీసుకుంటున్నారు. 

>
మరిన్ని వార్తలు