సీజేఐపై అభిశంసన; తిరస్కరించిన వెంకయ్య

23 Apr, 2018 10:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన విషయమై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో తీర్మానం కోరుతూ కాంగ్రెస్‌ సహా ఏడు విపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన నోటీసులను ఆయన తిరస్కరించారు. న్యాయనిపుణులతో చర్చల అనంతరం వెంకయ్య ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సోమవారం ఉపరాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదలచేసింది.

సుదీర్ఘ సంప్రదింపులు: సీజేఐ దీపక్‌ మిశ్రాపై అభిశంసన కోరుతూ 64 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులు గత వారం ఉప రాష్ట్రపతి వద్దకు చేరాయి. సదరు నోటీసులను అంగీకరించాలా, వద్దా అనేదానిపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులు, అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, మాజీ ఏజీ పరాశరణ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా తదితరులతో వెంకయ్య మాట్లాడారు. ఒక దశలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డిని కూడా సంప్రదించినట్లు సమాచారం. మూడు రోజుల తర్జనభర్జన తర్వాత చివరికి ‘నోటీసులు తిరస్కరిస్తున్నట్లు’ చెప్పారు.

సుప్రీంకు వెళ్లే యోచనలో కాంగ్రెస్‌: అత్యున్నత న్యాయస్థానంలోని ప్రధాన న్యాయమూర్తి పదవిని అధికార బీజేపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది. ఒకవేళ అభిశంసన తీర్మానం నోటీసులను ఉపరాష్ట్రపతి తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తున్నది.

మరిన్ని వార్తలు