అసమగ్రంగా సీవీసీ నివేదిక

17 Nov, 2018 04:32 IST|Sakshi

అలోక్‌ వర్మ కేసులో సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌కుమార్‌ వర్మ అవినీతికి సంబంధించి కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) సమర్పించిన భారీ ప్రాథమిక నివేదిక అసమగ్రంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అభియోగాల్లో కొన్నింటిలో సీవీసీ విచారణ అభినందించదగ్గ స్థాయిలో ఉందని, మరికొన్నింటి  విషయంలో దర్యాప్తు అసమగ్రంగా ఉందని పేర్కొంది. అలోక్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం దర్యాప్తు జరిపిన అత్యున్నత న్యాయస్థానం..‘సీవీసీ సుదీర్ఘమైన ప్రాథమిక నివేదికను సమర్పించింది. అభియోగాల్లో కొన్ని ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి.

ఈ అభియోగాలపై విచారణ జరిపేందుకు మరికొంత సమయం కావాలని సీవీసీ కోరింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను నవంబర్‌ 20కి వాయిదా వేస్తున్నాం’ అని తెలిపింది. సీబీఐ సంస్థ గౌరవం దృష్ట్యా ఈ నివేదికను గోప్యంగా ఉంచాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నివేదిక ప్రతిని తనకు అందజేయాలని సీవీసీ తరఫు న్యాయవాది తుషార్‌ మెహతా కోర్టును కోరారు. దీంతో నివేదికను అటార్నీ జనరల్, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాతో పాటు అలోక్‌ వర్మకు సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో దర్యాప్తును పర్యవేక్షించిన సుప్రీం మాజీ జడ్జి జస్టిస్‌ పట్నాయక్‌కు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే సీవీసీ నివేదికపై ప్రతిస్పందనను ఈనెల 19న మధ్యాహ్నం ఒంటి గంటలోపు సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని అలోక్‌వర్మను ఆదేశించింది. ఈ సందర్భంగా తమ క్లయింట్, సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాకు కూడా నివేదిక ప్రతిని అందజేయాలన్న ఆయన న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎన్టీవో సంస్థ కామన్‌కాజ్, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే దాఖలుచేసిన పిటిషన్లను నవంబర్‌ 20న విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు