నేను పరారు కాలేదు: మాల్యా

12 Mar, 2016 01:29 IST|Sakshi
నేను పరారు కాలేదు: మాల్యా

దేశ చట్టాలంటే గౌరవం; మీడియా విచారణ చేయొద్దు
♦ మీడియా బాసులకు ఎంతో సాయం చేశానని ట్వీట్
 
 న్యూఢిల్లీ/ముంబై: వేల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టి దేశం విడిచి పారిపోయారని దేశమంతా కోడై కూస్తున్న తరుణంలో వ్యాపారవేత్త విజయ్‌మాల్యా ఎట్టకేలకు స్పందించారు. తాను పరారు కాలేదని, మాతృభూమి చట్టానికి కట్టుబడి ఉంటానని చెప్పా రు. ‘నేను అంతర్జాతీయ వ్యాపారవేత్తను. భారత్ నుంచి విదేశాలకు, అక్కడి నుంచి భా రత్‌కు తరచూ ప్రయాణిస్తాను. నేను భారత్ విడిచి పారిపోలేదు. నేను పరారైన వ్యక్తిని కాదు’ అని శుక్రవారం గుర్తుతెలియని ప్రదే శం నుంచి మాల్యా ట్వీటర్‌లో చెప్పారు.

‘నేను భారతీయ ఎంపీని. ఈ దేశ చట్టాలను గౌరవిస్తాను. అయితే మీడియా విచారణ చేయకూడదు’అని మరో ట్వీట్ చేశారు. అలా గే పనిలోపనిగా తనపై వచ్చిన నిందలను మీడియాపైకి బదలాయించేందుకు మాల్యా ప్రయత్నించారు. ‘ఒక్కసారి మీడి యా వేట ప్రారంభించిందంటే అది మంటలను మరిం త రేపుతుంది. ఎంతలా అంటే ఆ మంటల్లో నిజాలు కాలి బూడిదయ్యేలా చేస్తుంది. నేను మీడియా బాసులకు కొన్నేళ్లుగా ఎంతో సా యం చేశాను.. ఎన్నో సౌకర్యాలను, ఉపకారాలను కల్పిం చాను. వాటిని మరవొద్దు. వీట న్నింటికీ పక్కా ఆధారాలున్నాయి. ఇప్పుడు టీఆర్‌పీ రేటింగ్ కోసం పాకులాడుతున్నా రా?’ అని మీడియాపై ఆక్రోశం వెళ్లగక్కారు.   

 రాజ్యసభలో దుమారం: మాల్యా వ్యవహారం రెండో రోజూ రాజ్యసభను కుదిపేసింది. గత అక్టోబర్‌లో మాల్యాపై సీబీఐ జారీచేసిన ‘లుక్‌అవుట్’ నోటీసులో నెలరోజుల్లోపే ఎందుకు మార్పు లు చేశారని రాజ్యసభలో విపక్షనేత ఆజాద్ ప్రశ్నించారు. దీనికి మంత్రి నక్వీ స్పందిస్తూ... ఇటలీ వ్యాపారవేత్త ఖత్రోచీకి కాంగ్రెస్ ప్రభుత్వం సాయం చేసినట్లు తాము మాల్యాకు సహాయం చేయలేదని చెప్పారు. లలిత్ మోదీకి కాంగ్రెస్ ప్రభుత్వం సాయం చేసిందని అప్పట్లో నిల దీసిన బీజేపీ.. ఇప్పుడు మాల్యా ఎలా పారి పోయారో చెప్పాలని ఎన్డీఏ భాగస్వామి అయిన శివసేన డిమాండ్ చేసింది. మాల్యా  జెంటిల్‌మన్ అని, ఆయన భారత్‌కు తిరిగొ స్తారని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. తాము బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్‌కు జారీచేసిన లుక్‌అవుట్ నోటీసుల్లో అనుకోని తప్పిదం జరిగినందునే మార్పు చేశామని సీబీఐ వివరణ ఇచ్చింది.

>
మరిన్ని వార్తలు