వర్షాల కోసం గుజరాత్‌ సర్కార్‌ పూజలు

24 May, 2018 16:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గాంధీనగర్‌ : గుజరాత్‌లో వరుణ దేవుడి కరుణ కోసం విజయ్‌ రూపానీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ పూజలు చేసేందుకు సన్నద్ధమైంది. వరుణ దేవుడి కటాక్షం కోసం అన్ని జిల్లాల్లో 41 యాగాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గుజరాత్‌లోని 33 జిల్లాలు, ఎనిమిది నగరాల్లో మే 31న యజ్ఞాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. రికార్డు స్ధాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిన క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వరుణ యాగాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు.

చెరువులు, నదుల్లో పూడికతీతకు ప్రభుత్వం చేపట్టిన సుజలాం సుఫలం జల్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగానే వరుణ యాగాలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మే 31న జరిగే వరుణ యాగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, మంత్రులు, సీనియర్‌ అధికారులు పాల్గొంటారని, అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారని డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ తెలిపారు. ఈ వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో గుజరాత్‌ ముందవరుసలో ఉంది.

మరిన్ని వార్తలు