లక్షకు పైగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఖాళీ

12 Dec, 2019 20:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో నీతి అయోగ్‌ ఎంపిక చేసిన మూడు ఆశావహ జిల్లాల్లో క్రమేపీ పెరుగుదల కనిపిస్తున్నట్లు ప్రణాళికా శాఖ సహాయ మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ రావు తెలిపారు.రాజ్యసభలో గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్‌ కడప జిల్లాలను ఆశావహ జిల్లాలుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. విజయనగరం, కడప జిల్లాలను వెనుకబాటుతనం ప్రాతిపదికన ఎంపిక చేయగా, విశాఖపట్నంను వామపక్ష తీవ్రవాదానికి గురైన జిల్లాగా పరిగణించి ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఆశావహ జిల్లాల కార్యక్రమం కింద ఆరోగ్యం, పోషకాహారం, పాఠశాల విద్య, వ్యవసాయం, నీటి వనరుల యాజమాన్యం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన మూడు ఆశావహ జిల్లాల్లో విశాఖ జిల్లా ఈ ఏడాది జనవరి నాటికి విద్యా రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించి మొదటి ర్యాంక్‌ సాధించినట్లు  తెలిపారు. ఈ జిల్లాలకు అదనంగా 3 కోట్ల రూపాయల కేటాయింపు జరుగుతుందని మంత్రి అన్నారు.

లక్షకు పైగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఖాళీ
దేశంలోని వివిధ రాష్ట్రాలలో గల ఉన్నత విద్యా సంస్థలలో లక్షకు పైగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ (నిషాంక్) గురువారం రాజ్యసభకు తెలిపారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఉన్నత విద్యా సంస్థలలో మొత్తం 38459 అధ్యాపకుల ఉద్యోగాలు మంజూరు అయ్యాయినట్లు వెల్లడించారు. అందులో ఈ ఏడాది జూన్ నాటికి 13399 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని,  వీటిలో 12272 ఉద్యోగాల భర్తీకి గత జూన్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఉద్యోగాల ఖాళీలు ఏర్పడటం వాటిని భర్తీ చేయడం అన్నది నిరంతర ప్రక్రియని, ఖాళీగా ఉన్న అధ్యాపకుల ఉద్యోగాలు భర్తీ చేయవలసిందిగా కోరుతూ యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌.. ఉన్నత విద్యా సంస్థలకు ఈ ఏడాదిలోనే నాలుగు సార్లు ఆదేశాలిచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా