నరేగా బకాయిలు విడుదల చేయండి : విజయసాయిరెడ్డి

29 Nov, 2019 14:39 IST|Sakshi

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద రాష్ట్రానికి రావలసిన రూ.2,246 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయవలసిందిగా ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో శుక్రవారం ఆయన మాట్లడుతూ...  ఏడాదిలో వంద రోజులపాటు వేతనంతో కూడిన పని కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకం వలన వేలాది కుటుంబాలకు జీవనోపాధి భద్రత కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ప్రధానమైన ఆదాయ వనరుగా మారిందని ఆయన తెలిపారు. 

ఈ ఏడాది రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలను కొన్ని నెలలపాటు దుర్బిక్షం వెంటాడింది. ఆ తర్వాత అంతే స్థాయిలో ఎడతెగని వర్షాలు ముంచెత్తాయన్నారు. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలు నెలల తరబడి వరదలతో సతమతమయ్యాయి. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా లభించే ఆదాయమే దిక్కయిందని పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు కేంద్రం నుంచి ఈ పథకం కింద విడుదల కావలసిన నిధులు సకాలంలో అందకపోవడంతో ఈ పథకం కింద డిమాండ్‌కు తగిన విధంగా పనులు కల్పించేలేని పరిస్థితి ఏర్పడింది.

ఉపాధి హామీ కింద పని చేసే కూలీలకు వేతనం 100 శాతం కేంద్ర నిధుల నుంచే చెల్లిచడం జరుగుతుంది. మెటీరియల్‌ ఖర్చుతో పాటు స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ వర్కర్ల వేతనాల కింద చేసే ఖర్చులో కేంద్రం 75 శాతం భరిస్తుంది. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెటీరియల్‌, పాలనా చెల్లింపుల పద్దు కింద చెల్లించాల్సిన రూ. 2,246 కోట్ల రూపాయలను విడుదల చేయలేదన్నారు. ఈ నిధులను కేంద్రం బకాయి పెట్టడం వలన ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రజలకు పనులు కల్పించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు మొత్తాన్ని సత్వరమే విడుదల చేయవలసిందిగా విజయసాయిరెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు