ప్రతి జిల్లాలో ప్రత్యేక క్రిమినల్‌ కోర్టు ఏర్పాటు చేయాలి

24 Jul, 2019 20:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చిన్నారులను లైంగిక దాడుల నుంచి రక్షించేందుకు వీలుగా సంబంధిత కేసుల సత్వర విచారణకు జిల్లాకు ఒక పోక్సో కోర్టు ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. చిన్నారులను లైంగిక దాడుల నుంచి రక్షించేందుకు ఉద్దేశించిన బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే సమయంలో లైంగిక దాడి తీవ్రతను నమోదు చేయరాదు. అది దర్యాప్తు జరిగిన తరువాత నిర్ధారించే బాధ్యతను న్యాయస్థానానికి వదిలిపెట్టాలి. ఎందుకంటే ముందే దాడి తీవ్రతను తక్కువగా చూపితే తరువాత దర్యాప్తులో వాస్తవాలు వెల్లడై తీవ్రమైన దాడిగా వెలుగులోకి రావొచ్చు. ప్రత్యేక కోర్టులను డిజిటలైజ్‌ చేయడం ద్వారా విచారణ వేగవంతమవుతుంది. న్యాయం త్వరగా అందుతుంది. ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక క్రిమినల్‌ కోర్టు ఏర్పాటు చేయాలి. ఏసీబీ కోర్టు, సీబీఐ స్పెషల్‌ కోర్టు తరహాలో చిన్నారుల లైంగిక దాడుదల నుంచి రక్షించేందుకు పోక్సో కోర్టు ఉండాలి. ఢిల్లీ వంటి నగరాల్లో పెరుగుతున్న నేరాల దృష్ట్యా చిన్నారులపై దాడులను అరికట్టేందకు కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. అనేక కేసులు పెండింగ్‌లో ఉండడం కూడా కలవరపెడుతోంది. వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది..’ అని పేర్కొన్నారు.  

ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి మూడు ముఖ్యమైన సూచనలు చేశారు. లైంగిక అత్యాచారాలకు సంబంధించి ఫలానా చర్యలు మాత్రమే తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వం వర్గీకరించడం తగదని అన్నారు. నేర తీవ్రతను గుర్తించే బాధ్యతను ఆయా కేసులను విచారించే న్యాయ స్థానాల విచక్షణకు వదిలేయాలని సూచించారు. అలాగే ఈ తరహా కేసులను విచారించే ప్రత్యేక న్యాయ స్థానాలను అధునీకరించి, డిజిటలైజ్ చేయడం వలన బాధితులకు సత్వర న్యాయం అందించే అవకాశం ఉంటుందని అన్నారు. మంత్రి స్మృతి ఇరానీ సమాధానం చెబుతూ విజయసాయి రెడ్డి ప్రస్తావించిన అంశాలపై స్పందించారు. అత్యాచార నేర స్వభావాన్ని వర్గీకరించవలసిన ఆవశ్యకతను ఆమె వివరిస్తూ బిల్లులో పొందుపరిచిన అంశాలను సమర్ధించారు.

మరిన్ని వార్తలు