అందుకే రాజకీయాల్లోకి : విజేందర్‌ సింగ్‌

24 Apr, 2019 15:07 IST|Sakshi

న్యూఢిల్లీ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి, ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ విమర్శించారు. ఒలింపిక్స్‌ పతకం సాధించిన తొలి భారత బాక్సర్‌గా చరిత్రకెక్కిన విజేందర్‌ రాజకీయాల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. హర్యానాకు చెందిన ఆయన ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘ కొంతమంది వ్యక్తులు ముసుగు వెనకాల ఎలా ఉంటారో మనకు తెలియదు. ముసుగు వెనుక ఏముందో కూడా తెలుసుకోకుండానే మనం కొన్నిసార్లు ఎదుటి వారిని పొగిడేస్తాం. అబద్ధపు ముసుగు వేసుకుని 2014లో బీజేపీ పెద్ద విజయం సాధించింది. పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని చెప్పింది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. కానీ ఏమయ్యింది. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు’ అని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఓ మాయా ప్రపంచాన్ని సృష్టించి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.

అందుకే రాజకీయాల్లోకి వచ్చాను
‘ మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. మా నాన్న బస్‌ డ్రైవర్‌, తాతయ్య ఆర్మీలో పనిచేసేవారు. ప్రసార మాధ్యమాల ద్వారా నిరంతరం జరిగే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం కదా. ఇందులో భాగంగా యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలనను, మోదీజీ పాలనను నిశితంగా గమనించాను. అందులో ఉన్న తేడాను గమనించాను. దేశ అభివృద్ధికై నా వంతు కృషి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నాను. నా సిద్ధాంతాలు, కాంగ్రెస్‌ సిద్ధాంతాలు ఒకటే. పేదలు, యువత, మధ్యతరగతి వారు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు ఇలా ప్రతీవర్గానికి న్యాయం చేయాలనే తపన కాంగ్రెస్‌ నేతలకు ఉంటుంది. బీజేపీ వాళ్లలాగా అర్థంపర్థంలేని మాటలు మాట్లాడటం, ఫాంటసీలు క్రియేట్‌ చేయడం మాకు చేతకాదు. ముఖ్యంగా నాలాంటి చదువుకున్న వ్యక్తులు బీజేపీకి దూరంగా ఉంటారు’ అని విజేందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇక తన ప్రత్యర్థి రమేష్‌ బిధూరి గురించి మాట్లాడుతూ.. 2014లో ఉన్న మోదీ వేవ్‌ కారణంగా ఆయన గెలుపొందారు.. కానీ ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యం అని విమర్శించారు. కాగా దక్షిణ ఢిల్లీ స్థానం హర్యానాకు ఆనుకొని ఉండటంతో.. జాట్లు, గుర్జర్ సామాజిక వర్గాల ఓటర్లను విజేందర్ తనవైపు తిప్పుకోగలడని భావించిన కాంగ్రెస్ ఈ సీటును అతనికి కేటాయించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు