‘నినాదాలు చేయడం కాదు.. సైన్యంలో చేరి పోరాడండి’

3 Mar, 2019 19:49 IST|Sakshi

ముంబై: ఇటీవల జమ్ము కశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఎంఐ-17 విమానం కూలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భారత వాయుసేన అధికారి నినాద్‌ ముందావ్‌గనే కూడా మృతిచెందారు. శుక్రవారం రోజున ఆయన మృతదేహానికి ప్రభుత్వ లాంఛానలతో నాసిక్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. నినాద్‌ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో భారత్‌ మాతా కీ జై, వందేమాతరమ్‌, వీర జవాన్‌ అమర్‌ హై అంటూ అక్కడికి వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అయితే ఈ నినాదాలపై నినాద్‌ భార్య విజేత ముందావ్‌గనే అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేసేవారికి కూడా ఆమె ఓ సూచన చేశారు. సోషల్‌ మీడియాలో జై భారత్‌, వందేమాతరమ్‌ వంటి నినాదాలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. దేశభక్తి ఉండి.. దేశం ప్రజల కోసం ఎదైనా చేయాలని భావిస్తే త్రివిధ దళాలలో చేరాలని.. లేకపోతే మీ కుటుంబంలో ఎవరినో ఒకరినైనా చేర్చాలని అన్నారు. అది కూడా కుదరని పక్షంలో సమాజంలో మార్పు కోసం ప్రయత్నించాలని.. పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, అమ్మాయిలపై వేధింపులకు పాల్పడకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆమె సందేశం విస్తృతంగా ప్రచారంలో ఉంది.  

మరిన్ని వార్తలు