ఆ ఊళ్లో ఓటెయ్యకుంటే రూ.51 జరిమానా

24 Apr, 2019 07:11 IST|Sakshi

ఎన్నికల్లో ఓటు వేయడానికి అభ్యర్థులు ఓటర్లకు డబ్బు ఇవ్వడం సాధారణంగా జరిగేదే. ఆ డబ్బు తీసుకున్న వారు ఓటేస్తారా లేదా అంటే చెప్పలేం. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ దగ్గరున్న రాజ్‌ సమధియాల గ్రామస్తులు మాత్రం డబ్బు తీసుకున్నా తీసుకోకపోయినా ఓటు మాత్రం తప్పనిసరిగా వేస్తారు. ఒకవేళ  ఓటెయ్యకపోతే యాభయ్యొక్క రూపాయలు జరిమానా కట్టాలి. ఓటెయ్యకపోతే ఎక్కడైనా ఫైన్‌ వేస్తారా అని ఆశ్చర్యపోకండి. ఈ ఊళ్లో కచ్చితంగా వేస్తారు. ఇంతకు ముందు ఎన్నికల్లోనూ ఈ జరిమానా నిబంధన అమలు చేశారు. హైటెక్‌ విలేజ్‌గా పేరొందిన రాజ్‌సమధియాలలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) ఉంది. గ్రామస్తులు ఎలా నడుచుకోవాలి, గ్రామం ఎలా ఉండాలి వంటి విషయాల్లో ఈ కమిటీ కొన్ని నియమాలు అమలు చేస్తోంది.

వాటిలో ఓటెయ్యకపోతే జరిమానా కట్టడం కూడా ఒకటి. అంతేకాదు.. ఈ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిషేధం. ‘ఎన్నికల ప్రచారం వల్ల ఊరు రెండుగా చీలిపోతుంది. దానివల్ల గ్రామానికి, ప్రజలకీ ఇబ్బందే. ప్రశాంతంగా ఉన్న ఊర్లో గొడవలు తేవడం ఇష్టంలేదు. అందుకే ఎన్నికల ప్రచారాన్ని నిషేధించాం’ అన్నారు సర్పంచ్‌ అశోక్‌ భాయ్‌ వఘేరా. పార్టీలు కూడా తమను అర్థం చేసుకున్నాయని, ఎవరూ ప్రచారానికి రాలేదని ఆయన తెలిపారు. ప్రచారాన్ని నిషేధించినా తాము ఓట్లు మాత్రం వీలైనన్ని ఎక్కువ పడేలా చూస్తామని, ప్రతి ఎన్నికల్లోనూ 90–95 శాతం ఓట్లు పడతాయని ఆయన చెప్పారు. చనిపోయిన వారి పేర్లు, పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోయిన వారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉండటం వల్ల నూరు శాతం పోలింగ్‌ సాధ్యం కావడం లేదని అశోక్‌ భాయ్‌ అన్నారు. మూడో దశలో భాగంగా మంగళవారం ఇక్కడ పోలింగ్‌ నిర్వహించారు.

మరిన్ని వార్తలు