చిన్నారుల జీవితాల్లో వెలుగులు

22 Sep, 2015 10:24 IST|Sakshi
చిన్నారుల జీవితాల్లో వెలుగులు

గ్రామాల్లో ఎస్‌హెచ్‌జీల సామాజిక సేవ
తక్కువ బరువున్న చిన్నారులకు సమతుల ఆహారం అందించడం, బిడ్డల సంరక్షణ గురించి గిరిజనులకు వివరించడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా స్వయం సహాయక బృందాల (డబ్ల్యూఎస్‌ఎచ్‌జీ)ను ఏర్పాటు చేసింది. ఇవి బాధిత చిన్నారులను దత్తత తీసుకొని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం ఇప్పిస్తున్నాయి.
 - కొండగావ్/ధమ్‌తారీ (ఛత్తీస్‌గఢ్)
 
 ఎక్కడో మూలనపడేసినట్టుంటే ఛత్తీస్‌గఢ్ గిరిజన జిల్లా కొండగావ్‌లోని గోండుపల్లెలో పుట్టిన రెండేళ్ల బాలిక ప్రియాంక బరువు కేవలం ఐదు కిలోలు. తగిన పోషకాహారం లేకపోవడం ఈ చిన్నారికి శాపంగా పరిణిమించింది. దీంతో చికిత్స కోసం ఆమెను రెండు నెలల క్రితం స్థానిక పోషకాహార పునరావాస కేంద్రానికి (ఎన్సార్సీ) తీసుకెళ్లారు. శాంపూర్ అనే కుగ్రామానికి చెందిన రోజువారీ కూలీలకు చెందిన కుటుంబానికి చెందిన ప్రియాంక అక్కడ 15 రోజులు ఉంచి చికిత్స చేయడంతో ఆమె కాస్త కోలుకుంది. ప్రియాంకలా తక్కువ బరువున్న చిన్నారులకు సమతుల ఆహారం అందించడం, బిడ్డల సంరక్షణ గురించి గిరిజనులకు వివరించడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా స్వయం సహాయక బృందాల (డబ్ల్యూఎస్‌ఎచ్‌జీ)ను ఏర్పాటు చేసింది. ‘ఎముకల గూడులా కనిపించిన ప్రియాంకకు నిత్యం ఎనిమిదిసార్లు సమతుల ఆహారం ఇచ్చాం. ప్రస్తుతం కొంత వరకు కోలుకుంది కానీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేదు. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. బాలిక కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది’ అని అంగన్‌వాడీ కార్యకర్త దూషణ్ పాండే చెప్పారు. నవజాతన్ పథకం కింద ఆమెకు రోజుకు ఐదారుసార్లు అన్నం, పప్పు, కూరగాయలతో కూడిన ఆహారపదార్థాలు పెడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ జనాభా 2.6 కోట్లు కాగా, వీరిలో 30 శాతం మంది గిరిజనులే.

వీరి సంతానంలో 30.55 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. నవజాతన్ వంటి పథకాల అమలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా విజయాలు సాధించింది. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులను ఆదుకోవడానికి ప్రారంభించిన నవజాతన్ కార్యక్రమం అమలుకు  డబ్ల్యూఎస్‌ఎచ్‌జీలను ఏర్పాటు చేసింది.  పోషకాహార లేమితో బాధపడే చిన్నారుల సంఖ్య  గణనీయంగా తగ్గుతున్నదని ధామ్‌తారీ జిల్లా కలెక్టర్ భీంసింగ్ అన్నారు. చిన్నారులు తమ వయసుకు తగ్గ బరువున్నదీ లేనిదీ తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా వజన్ త్యోహార్ (బరువు పండుగ)లను నిర్వహిస్తున్నామని తెలిపారు.
 
 ఇప్పుడు కాస్త నయం...
 ధామ్‌తారీలో 2012లో పోషకాహార లేమితో బాధపడే చిన్నారుల సంఖ్య 43.89 శాతం ఉండగా, 2014 నాటికి 33.71 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జూన్ 8 వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ప్రస్తుతం సమతుల ఆహార లేమితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 24.59 శాతంగా ఉంది. డబ్ల్యూఎస్‌ఎచ్‌జీలు ఇలాంటి చిన్నారులను దత్తత తీసుకొని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం ఇప్పిస్తున్నాయని సింగ్ చెప్పారు. గత మూడేళ్లలో తక్కువ బరువున్న బాలల సంఖ్య కూడా బాగా తగ్గినట్టు వజన్ త్యోహార్ల ద్వారా గుర్తించామన్నారు. 'మధ్యస్థాయి' లేదా 'అత్యల్పం' గా బరువున్న బాలలందరికీ నవజాతన్ పథకం ద్వారా బలవర్ధకమైన ఆహారం అందజేస్తున్నారు. ఈ పథకం రూపకల్పన, సామర్థ్యాల నిర్మాణం కోసం ఐరాస అధీనంలో పనిచేసే యూనిసెఫ్ తగిన సహకారం అందిస్తోంది. పేదరికం, లింగ, సామాజిక దురాచారాలు, నాయకత్వ, అవగాహన లేమి, కుటుంబ నియంత్రణ పాటించకపోవడం, చిన్న వయసులో గర్భం దాల్చడం వంటి సమస్యల వల్ల ఛత్తీస్‌గఢ్ గిరిజన గ్రామాల చిన్నారులకు పోషకాహారం అందడం లేదని డబ్ల్యూఎస్‌ఎచ్‌జీ సభ్యురాలు ఒకరు చెప్పారు.

గిరిజనుల్లో స్త్రీపురుషులిద్దరూ మద్యం సేవించడం వల్ల వారి చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, పెంపకంపై శ్రద్ధ చూపలేకపోతున్నారని బేలారాణి బిశ్వాస్ అనే అంగన్‌వాడీ సూపర్‌వైజర్ అన్నారు. అందుకే గిరిజన దంపతులకు కూడా తరచూ కౌన్సెలింగ్ నిర్వహించి చిన్నారుల సంరక్షణ ప్రాధాన్యాన్ని వివరిస్తున్నామని చెప్పారు. మనదేశంలోని దాదాపు పది కోట్ల మంది గిరిజనులు ఇప్పటికీ పేదిరకంలోనే మగ్గుతున్నారని, వీరి చిన్నారులకు పోషకాహారం దొరకడం లేదని 2009లో అప్పటి ప్రణాళికా సంఘం ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు