సీపీఎం వల్లే కేరళలో హింస

7 Aug, 2017 01:07 IST|Sakshi
సీపీఎం వల్లే కేరళలో హింస

అరుణ్‌ జైట్లీ ధ్వజం
తిరువనంతపురం: కేరళలో రాజకీయ హింసకు రాష్ట్రంలోని అధికార సీపీఎం పార్టీనే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను నిర్మూలించడానికి సీపీఎం తన శ్రేణులను ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. ఇటీవల హత్యకు గురైన ఆరెస్సెస్‌ కార్యకర్త రాజేశ్‌ ఎడవకోడ్‌ కుటుంబ సభ్యులను జైట్లీ ఆదివారమిక్కడ పరామర్శించారు. రాజేశ్‌ను దారుణంగా చంపారని, మృతదేహంపై 70కిపైగా గాయాలున్నాయని జైట్లీ చెప్పారు. గాయాలు ఉగ్రవాదులు కూడా సిగ్గుపడేలా ఉన్నాయని పేర్కొన్నారు.

తర్వాత సంతాప సభలో ఆయన ప్రసంగించారు. ‘రాష్ట్రంలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా హింస పెరుగుతోంది. భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. అయితే రాజకీయ హింసతో ఆరెస్సెస్, బీజేపీలను అణచివేయలేరు.  దేశంలోని మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న హింసపై మాట్లాడుతున్న వారు కేరళలో చోటుచేసుకుంటున్న హింసపై ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ఆయన ప్రశ్నించారు. ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలను చంపుతోంటే పోలీసులు ప్రేక్షకుల్లా మిగిలిపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు.  

షా పర్యటన తర్వాతే హింస..
జైట్లీ ఆరోపణలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ తోసిపుచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా జూన్‌లో రాష్ట్రంలో పర్యటించాకే రాజకీయ హింస పెరిగిందని ఆరోపించారు. ఆరెస్సెస్‌–బీజేపీ దాడుల్లో చనిపోయినట్లు భావిస్తున్న 21 మంది లెఫ్ట్‌ కార్యకర్తల బంధువులతో సీపీఎం రాజ్‌భవన్‌ వద్ద ధర్నా నిర్వహించింది. మరోపక్క.. హింసకు అడ్డకట్ట వేసే మార్గాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జైట్లీ ఆరోపణలను తోసిపుచ్చారు.  హింస నిరోధానికి గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు