వీఐపీలకు భద్రత కట్టుదిట్టం

24 Oct, 2016 18:43 IST|Sakshi
వీఐపీలకు భద్రత కట్టుదిట్టం

- ఆరు రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
హైదరబాద్:
ఏఓబీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకారదాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాలను కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడంతో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలువురువీఐపీలతో పాటు టార్గెట్‌లో ఉన్న రాజకీయ నేతల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పథకరచన చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులపై దాడులు నిర్వహించేందుకు మావోయిస్టు నేత నంబాల కేశవరావు అలియాస్ ఆశన్న నేతృత్వంలో యాక్షన్ టీమ్‌లు రంగంలోకి దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధానంగా చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో వీఐపీల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా అన్ని జిల్లాల ఎస్పీలనూ తెలుగు రాష్ట్రాల డీజీపీలు ఎన్.సాంబశివరావు, అనురాగ్ శర్మ ఆదేశాలు జారీచేశారు.

నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై శాంతి భద్రతల విభాగం అదనపు డీజీలు, నిఘా చీఫ్‌లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మారుమూల ప్రాంతాల పర్యటనలకు వెళ్లరాదని మంత్రులు, ప్రజాప్రతినిధులకు జిల్లా ఎస్పీల ద్వారా సమాచారం పంపారని తెలిసింది. దండకారణ్య సరిహద్దులోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్ పరిధుల్లోని ప్రాంతాలతో పాటు ఏవోబీ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అదనపు గ్రేహౌండ్స్ బలగాలను రంగంలోకి దింపారు. విస్తృతస్థాయిలో గాలింపు, కూంబింగ్ ఆపరేషన్లు జరుపుతున్నారు. దండకారణ్యం, కేకేడబ్ల్యూ జోన్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి చొరబాట్లు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మైదాన ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు దాడులకు దిగే అవకాశం ఉందని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని కీలక/అనుమానిత ప్రాంతాల్లో విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు ఆదేశాలు అందాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు