‘చెత్తశుద్ధి’ లేని వీఐపీలు

3 Oct, 2014 01:24 IST|Sakshi
‘చెత్తశుద్ధి’ లేని వీఐపీలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం స్వచ్ఛభారత్. దేశాన్ని పరిశుభ్రమైన భారత్‌గా తీర్చిదిద్దాలనేది ఆయన లక్ష్యం. అయితే ఇండియా గేట్ వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వీఐపీలకు స్వచ్ఛ భారత్ స్ఫూర్తి అర్థం అయినట్టు కనిపించలేదు.

ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం వీరంతా తమ సీట్ల వద్దే ఖాళీ వాటర్ బాటిళ్లు, కరపత్రాలను వదిలేశారు. వారికి సమీపంలోనే భారీ డస్ట్ బిన్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేసినా ఎవరూ దానిని పట్టించుకోలేదు. కార్యక్రమం పూర్తయిన వెంటనే మోదీ వెంట వెళ్లేందుకు తొందరపడిన వీఐపీలు చెత్తను అక్కడే వదిలేశారు. చెత్తను వేసేందుకు ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ కిందపడి.. అందులోని వ్యర్థాలు, ఖాళీ వాటర్ బాటిళ్లు బయటపడి ఆ ప్రదేశమంతా చిందరవందరగా తయారైంది.  

స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మద్దతిచ్చేందుకు బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ వచ్చిన సమయంలో వీవీఐపీ, మీడియా ఎన్‌క్లోజర్‌లో గందరగోళం చెలరేగింది. ఆమిర్‌ను కలిసేందుకు మీడియా ప్రతినిధులు, సీనియర్ అధికారులు ప్రయత్నించడంతో ఒక దశలో తొక్కిసలాట జరుగుతుందేమో అన్న పరిస్థితి నెలకొంది.

స్వచ్ఛ భారత్ ప్రారంభోత్సవంలో స్కూలు విద్యార్థులే ప్రత్యేక ఆకర్షణ. వివిధ ప్రభుత్వ పాఠశాలల నుంచి 5 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరంతా మోదీతో పాటు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయడమే కాక.. ఆయన  చెప్పిన పరిశుభ్రతా సూచనలను పాటిస్తూ అందరినీ ఆకర్షించారు. కార్యక్రమం సాగినంత సేపూ విద్యార్థులు మూడు రంగుల బెలూన్లు, రంగురంగుల పోస్టర్లు చేత పట్టుకుని హంగామా చేశారు.

దక్షిణాది నుంచి వచ్చినవారికి హిందీలో చెప్పిన స్వచ్ఛతా సందేశం అర్థం కాలేదని, అందువల్ల తాను ఇంగ్లిష్‌లో ప్రసంగిస్తానని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు  చెప్పడంతో సభికులంతా చప్పట్లు కొట్టారు.

స్వచ్ఛ భారత్... యూపీఏ పథకమే:  స్వచ్ఛ భారత్ పథకం కొత్తదేమీ కాదని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పుకొచ్చారు. యూపీఏ హయాంలో చేపట్టిన నిర్మల్ భారత్ అభియాన్  పేరు మార్చి మోదీ సర్కారు స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించిందన్నారు. ఈ పథకాన్ని కేంద్రం వాస్తవిక కోణంలో అమలు చేయాలని లేకుంటే ఇది ఫొటో ప్రదర్శనగా మారవచ్చని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు