వైరల్‌: ఒంటికాలితో పరుగు

30 Jan, 2020 19:38 IST|Sakshi

అన్ని అవయవాలు బాగానే ఉన్నా.. ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తారు చాలామంది. కానీ ఇక్కడ చెప్పుకునే బాలిక మాత్రం దేవుడు తనకు అంగవైకల్యం ఇచ్చాడు కానీ మనోవైకల్యం ఇవ్వలేదని ఆత్మవిశ్వాసాన్ని చాటి అందరి మన్ననలు పొందుతోంది. ఓ చోట నిర్వహించిన పరుగుపందెం పోటీలో కొందరు బాలబాలికలతో పాటు ఓ దివ్యాంగురాలు కూడా పాల్గొంది. పోటీ ప్రారంభం కాగానే ఒంటి కాలుతో పరుగు ప్రారంభించింది. మిగతావాళ్లు తనను దాటేసి వెళుతుంటే మొక్కవోని దీక్షతో వారిని అందుకోడానికి ఉబలాటపడింది. వారితో సమానంగా ఉరికేందుకు ప్రయత్నించింది. లక్ష్యాన్ని అందుకునేందుకు చివరివరకు పోరాడింది.. కానీ విజయాన్ని అందుకోలేకపోయింది.

దీనికి సంబంధించిన వీడియోను భారతీయ అటవీశాఖ అధికారి సుశాంత్‌ నందా గురువారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘అసాధ్యం అనేది మీరు కల్పించుకునే ఓ భావన మాత్రమే’నంటూ దీనికి ఓ క్యాప్షన్‌ జోడించాడు. పద్దెనిమిది సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. చిన్నవయసులో ఆమె ఆత్మస్థైర్యాన్ని చూసి నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ‘ఆమె అసలైన విజేత’, ‘ఆ పోటీలో ఓడినా, జీవితంలో ఆమె లక్ష్యాన్ని సాధిస్తుంది’ అని ఆమె కృషిని కొనియాడుతున్నారు. ఈ వీడియో ఎందరికో స్ఫూర్తిదాయకమని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 30 వేల మందికి పైగా వీక్షించారు. చదవండి: బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్‌ క్యాప్‌..

మరిన్ని వార్తలు