‘నీ బట్టలు ఎలా ఉన్నాయో చూసుకున్నావా’

27 Nov, 2018 15:47 IST|Sakshi

అత్యాచార బాధితురాలి పట్ల సమాజం తీరు ఒకేలా ఉంటుంది. పోలీసుల దగ్గర నుంచి.. రోడ్డు మీద తిరిగే జనాల వరకూ.. అపరిచితుల నుంచి.. కుటుంబ సభ్యుల వరకూ అందరూ ఒకేలా ఆలోచిస్తారు, ‘ఆమె’దే తప్పంటారు. బాధితులకు సాయం చేసే మాట పక్కన పెడితే.. కనీసం మర్యాదగా మాట్లాడటం కూడా చేయరు. దారుణమైన విషయం ఏంటంటే ఇటువంటి నీచమైన పరిస్థితుల్లో కూడా జనాలు.. బాధితురాలిదే నేరం అంటారు. ఆమెనే తప్పు పడతారు.. అవమానిస్తారు. అత్యాచార బాధితురాలి పట్ల సమాజం స్పందన ఎలా ఉంటుందనే అంశంపై ఓ సామాజిక సంస్థ ఓ వీడియోను రూపొందించింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది చూశారు.

‘షేమ్‌ ఆన్‌ హూ?’ అనే పేరుతో రూపొందించిన ఈ వీడియోలో మనాల్‌ అనే అమ్మాయి అత్యాచారి బాధితురాలిగా నటించారు. అమె చూట్టు ఉన్న వారంతా నిజమైన వారు.. సమాజంలోని అసలు సిసలు ‘మనుషులు’. వీడియోలో ‘నా మీద అత్యాచారం జరిగింది. సాయం చేయండం’టూ కోరిన సదరు బాధితురాలు ఎదుర్కొన్న ప్రశ్నల పరంపర ఎలా ఉందంటే.. ‘నువ్వు తాగావా.. డ్రగ్స్‌ తీసుకున్నావా..? అంటూ కొందరు ప్రశ్నించగా.. మరి కొందరు మహిళలు ‘ఈ విషయాన్ని గట్టిగా చెప్పకు.. నీ పరువే పోతుంది’ అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. మరి కొందరు మరో అడుగు ముందుకేసి అసభ్యపదజాలాన్ని వాడారు.

మరికొందరు ‘నీ బట్టలు చూడు.. ఎలా ఉన్నాయో.. ఇలాంటి బట్టలు ధరిస్తే ఇలానే జరుగుతుంది’. ‘నా సోదరి ఎప్పుడు ఇలాంటి బట్టలు ధరించదు’ అంటూ కామెంట్‌ చేశారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ నీచుడు ఎవరనే ప్రశ్న వేయలేదు.. కనీసం పద పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనే ధైర్యాన్ని కూడా ఇవ్వలేదు. ఇక్కడ నేరం ఎవరిది.. సమాజం ఎవరిని బాధ్యులను చేస్తుంది. సిగ్గు పడాల్సింది ఎవరూ.. ఎవరిని అవమానిస్తున్నాం అనే సందేశంతో రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు