చిన్నపిల్లలు సార్‌.. వదిలేయండి

25 May, 2018 08:33 IST|Sakshi
వీడియోలోని దృశ్యాల ఆధారంగా...

సాక్షి, చెన్నై: తూత్తుకుడి హింసపై నేడు(శుక్రవారం) తమిళనాడు బంద్‌కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. స్టెరిలైట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఆందోళన పోలీసుల కాల్పులతో హింసాత్మకంగా మారింది. మొత్తం 13 మంది మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. పైగా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆందోళనకారులపై పోలీసుల దమనకాండను సమర్థిస్తూ ప్రకటన చేయటం ప్రతిపక్షాల్లో ఆగ్రహన్ని తెప్పించింది. మరోవైపు లాఠీఛార్జీ సమయంలో కొందరు రిపోర్టర్లు చేసిన లైవ్‌ రిపోర్టింగ్‌  వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. చిన్న పిల్లలను అని కూడా చితకబాదటంతో ఓ రిపోర్టర్‌ అడ్డుకున్నారు. లైవ్‌ కవరేజ్‌ చేస్తున్న ఆ రిపోర్టర్‌కు, పోలీసులకు మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.

రిపోర్టర్‌: నిరసనకారులను పోలీసులు అణచివేస్తున్నారు. చిన్న పిల్లలనీ కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు బాదుతున్నారు.
ఇంతలో ఓ కానిస్టేబుల్‌ జోక్యం చేసుకుంటూ... : అదే నిరసనకారులంతా కలిసి ఓ పోలీస్‌ అధికారిని చితకబాదినప్పుడు మీ మీడియా ఎక్కడికి పోయింది? ఎందుకు కవరేజ్‌ చెయ్యలేదు? ఇప్పుడు మాపై ఎందుకు నిందలేస్తున్నారు?
రిపోర్టర్‌: కానీ, మీరు 11 మందిని కాల్చి చంపారుగా...
పోలీసులు: మేం కాల్చలేదు. ఎవరు చంపారో వారినే అడగండి.
రిపోర్టర్‌: చిన్నపిల్లలు సార్‌.. దయచేసి వారిని వదిలేయండి
పోలీసులు: ఇంతకీ ఎవరు నువ్వు? ఏ ఛానెల్‌?
రిపోర్టర్‌: వికటన్‌ ఈ-మాగ్జైన్‌

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘బుల్లెట్‌ తగిలి తీవ్ర రక్తస్రావమైన ఓ యువకుడిని సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లకపోగా, నటించింది ఇక చాలూ ఇక్కడి నుంచి వెళ్లు... అంటూ పోలీసులు కసురుసుకోవటం, ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోవటం...’ ఆ వీడియో కూడా నిన్నంతా  చక్కర్లు కొట్టింది. పోలీసుల లాఠీఛార్జీలో 2, కాల్పుల్లో 11 మంది మొత్తం 13 మంది నిరసనకారులు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఇప్పటివరకు ప్రాణాలు విడిచారు.  ఇక నిషేధాజ్ఞలను ధిక్కరించి తూత్తుకుడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన స్టాలిన్, వైగో, కమల్‌ హాసన్‌ తదితర నాయకులపై కేసులు నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు