తరుముకొస్తున్న యముడిలా హిమపాతం!

14 Jan, 2020 16:02 IST|Sakshi

సిమ్లా: తరుముకొస్తున్న హిమపాతం నుంచి పర్యాటకులు తప్పించుకున్న ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కిన్నౌర్‌ జిల్లాలోని టింకు నల్లా ప్రాంతంలో మంచు కొండలను చూడటానికి పర్యాటకులు వెళ్లారు. ఆ సమయంలో హిమపాతం కదులుతూ వీరు వెళుతున్న రోడ్డుపై ప్రవేశించింది. అయితే కొంతమంది పర్యాటకులు దీన్ని లెక్క చేయకుండా ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. అయితే హిమపాతం వారిని వెంటాడుతున్నట్టుగా రోడ్డుపై మరింత ముందుకు వస్తూనే ఉంది. దీంతో ఓ పర్యాటకుడు ‘వెనక్కి వెళ్లిపొమ్మని ఇతరులకు సూచించాడు. కొంతమంది భయంతో వెనక్కి వెళ్లి తమ కార్లలో ఎక్కి కూర్చున్నారు.

కానీ కొందరు మాత్రం కదులుతున్న మంచు కొండను వీడియో తీస్తూనే పరుగెత్తుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నవీద్‌ ట్రుంబో అనే అధికారి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. మంచు ముద్ద.. వెంటాడుతున్న యముడిలా రోడ్డు మీదకు రావటాన్ని చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక పర్యాటకులు కొంచెం కూడా జాగ్రత్తపడకుండా దాన్ని దగ్గర నుంచి వీడియో తీయడాన్ని పలువురు తప్పుపట్టారు. ‘అంత దగ్గర నుంచి తీస్తే పోతారు’ అంటూ ఓ నెటిజన్‌ టూరిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘హిమపాతం భారీ పరిమాణంలో ఉండి చాలా నెమ్మదిగా కదులుతుంది. మరి అది నిజంగానే హిమపాతమేనా?’ అని ఓ నెటిజన్‌ అనుమానం వ్యక్తం చేయగా ‘హిమపాతంలో అది ఓ భాగం అయ్యుండొచ్చ’ని మరో నెటిజన్‌ సమాధానమిచ్చాడు.

మరిన్ని వార్తలు