జూలో మూగజీవాల కోసం వినూత్న ప్రయోగం

1 Jan, 2020 09:40 IST|Sakshi

కాస్త చలి పెడితే చాలు.. ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటేనే ఒకటికి వందసార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఎప్పుడూ బయటే తిరుగాడే మూగ జంతువులకు చలి పెట్టదా అంటే పెడుతుంది. అవి కూడా మనుషుల్లానే చలి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తాయి. మరి జూలో ఉండే జంతువుల మాటేమిటి? అవి ఎలాంటి చలిలోనైనా వణుకుతూ బాధపడాల్సిందేనా అనిపించక మానదు. కానీ అస్సాంలోని గౌహతి జూ అధికారులకు కూడా సరిగ్గా ఈ ప్రశ్నే తట్టింది.

వాటి కోసం ఏదైనా చేయాలని భావించిన అస్సాం స్టేట్‌ జూ కమ్‌ బొటానికల్‌ గార్డెన్‌ అధికారులకు చక్కని ఐడియా తట్టింది. బోనులో ఉన్న పులుల, సింహాలు వెచ్చదనాన్ని అనుభూతి చెందేందుకు ఎన్‌క్లోజర్‌ వెలుపల హీటర్‌లను ఏర్పాటు చేశారు. అయితే అన్ని జంతువులకు హీటర్‌ అంత మంచిది కాదు. దీంతో పచ్చిక బయళ్లపై తిరుగాడే జింక, తదితర జంతువుల కోసం ప్యాడీ స్ట్రాలను అక్కడి గడ్డిపై పరిచారు. పాపం.. మూగ జీవాలకు ఎంత కష్టం వచ్చిందని కొందరు నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు. జంతువులను బంధించకుండా వదిలేస్తే అయిపోయేది కదా అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు