సెహ్వాగ్, కైఫ్ కలిసి ఉతికేశారు!

19 May, 2017 15:18 IST|Sakshi
సెహ్వాగ్, కైఫ్ కలిసి ఉతికేశారు!

కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన ఆదేశాలు భారతీయులందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించాయి. దాంతో తమకు తోచిన రీతిలో ఆ ఆనందాన్ని పదిమందితో పంచుకున్నారు. అయితే ఇది పాకిస్తానీలకు కంటగింపుగా మారింది. కుల్‌భూషణ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పడం, ఈ కేసు తమ పరిధిలోకే వస్తుందనడం, అసలు ఉరిశిక్ష అమలు మీదే స్టే విధించడం లాంటి కోర్టు నిర్ణయాలు భారతీయులను సంబరాల్లో ముంచెత్తగా పాకిస్తానీలు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతర్జాతీయ కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ భారతీయ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్ చేసిన ట్వీట్ల మీద రెచ్చిపోయి కామెంట్లు పెట్టి.. అడ్డంగా బుక్కైపోయారు.

అంతర్జాతీయ కోర్టు నిర్ణయం రాగానే సెహ్వాగ్ కుల్‌భూషణ్ హ్యాష్ ట్యాగ్‌తో 'సత్యమేవ జయతే' అని ట్వీట్ చేశారు. దానికి ఫర్హాన్ జహూర్ అనే పాకిస్తానీ వ్యక్తి స్పందించాడు. ''మీకు బుర్రలు తక్కువా? తుది నిర్ణయం ఇంకా రాలేదు, ఐసీజే స్టే ఇచ్చినా కూడా అతడిని మేం ఉరి తీస్తాం. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లంది'' అని ట్వీట్ చేశాడు. దాంతో సెహ్వాగ్‌కు ఒళ్లు మండింది. ''భారతదేశాన్ని ప్రపంచకప్‌లో ఓడించాలన్నట్లే ఇది కూడా మీకు కలగానే మిగిలిపోతుంది. కుక్కను పెంచుకోండి, పిల్లిని పెంచుకోండి గానీ, దురభిప్రాయాలను పెంచుకోకండి'' అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ముల్తాన్‌ గడ్డ మీదే పాకిస్తాన్ మీద సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే.

ఇక మహ్మద్ కైఫ్ కూడా ఇదే అంశం మీద స్పందించాడు. ''కంగ్రాచ్యులేషన్స్ ఇండియా.. అంతర్జాతీయ కోర్టుకు ధన్యవాదాలు. న్యాయం నిలబడింది'' అంటూ ట్వీట్ చేశాడు. దానికి ఆమిర్ ఆక్రమ్ అనే పాకిస్తానీ ట్విట్టర్ యూజర్ రెచ్చిపోయాడు. ''ముందు నీ పేరు లోంచి మహ్మద్ అనే పదాన్ని తీసెయ్యి'' అని రాశాడు. దానికి కైఫ్ కూడా దీటుగా స్పందించాడు. 'వావ్.. నేను భారతదేశ విజయానికి మద్దతిస్తే, నేను మహ్మద్ అనే పేరు తీసెయ్యాలా.. నా పేరు అంటే నాకు గర్వంగా ఉంటుంది. ఆమిర్ అంటే పూర్తి జీవితం. అది నీకు ఉండాలి'' అంటూ కాస్తంత హెచ్చరికస్వరంతోనే కైఫ్ సమాధానం ఇచ్చాడు.

 

మరిన్ని వార్తలు