జనవరి నుంచి విశాఖ-యశ్వంతపుర వీక్లీ రైలు

21 Dec, 2018 18:33 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి

ఢిల్లీ: విశాఖపట్నం-యశ్వంతపుర వీక్లీ స్పెషల్‌ రైలు సర్వీసును జనవరి నుంచి ఏప్రిల్‌ 2019 వరకు పునఃప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ వీక్లీ స్పెషల్‌ రైలుకు విపరీతమైన రద్దీ ఉన్న విషయం వాస్తవమేనా? అలాంటప్పుడు ఈ సర్వీసును గతంలో  రైల్వే నిలిపివేయడానికి కారణాలేంటి? అంటూ శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్న లేవనెత్తారు. ఈ ప్రశ్నకు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ జవాబిస్తూ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యం కోసమే ప్రత్యేక రైళ్లు నడపడం రైల్వే విధానమని చెప్పారు.

నిలిపేసిన విశాఖపట్నం- యశ్వంతపురా స్పెషల్‌ ట్రైన్‌ను తిరిగి జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు పునరుద్ధరించాలని కూడా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. నిర్వహణా సాధ్యాసాధ్యాలు, ప్రయాణీకుల రద్దీ, వనరుల అందుబాటు వంటి అంశాల ప్రాతిపదిక ఆధారంగా సెలవుల సీజన్‌, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే రైల్వే ప్రత్యేకంగా ట్రైన్లను నడుపుతుందని వివరించారు. విశాఖపట్నం-యశ్వంతపుర సెక్టర్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న 16 జతల రైలు సర్వీసులకు అదనంగా రద్దీని నివారించేందుకు విశాఖ-యశ్వంతపుర స్పెషల్‌ రైలును నడపడం జరుగుతుందని మంత్రి చెప్పారు.

మరిన్ని వార్తలు