ఇకపై అన్ని రైళ్లలోనూ ఆ సేవలు..!

1 Jan, 2020 11:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయాణికుల ప్రయాణం ఇకపై మరింత సురక్షితంగా, సుఖవంతం చేసే క్రమంలో భారతీయ రైల్వే సేవలను మరింత విస్తృత పరచనుంది. 2022 మార్చి కల్లా ప్రతి రైల్వే స్టేషన్‌లోనూ, రైలులోని ప్రతి బోగీలోనూ సీసీ కెమెరాలను అమరుస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 530 రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

చదవండి: కెనడాలో ఘోర రైలు ప్రమాదం..13మంది మృతి

రైల్వేబోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్, రైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే టెండర్లను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ల పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.500 కోట్ల నిర్భయ ఫండ్ నిధులు వచ్చాయన్నారు. 6,100 స్టేషన్లు, 58 వేలకు పైగా రైల్వే బోగిల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు రైల్వేశాఖ రూ.2,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఫేసియల్ రికగ్నేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నిందితులను గుర్తిస్తాం. ప్యాసింజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కెమెరాలను కామన్ ఏరియాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు . రైళ్లను కూడా ఆన్‌టైమ్‌కు నడిచేలా చేయడానికి, ఆటోమేటిక్ చార్ట్ ప్రిపరేషన్ వంటి వాటి కోసం ఇస్రోతో కలిసి పనిచేస్తున్నట్లు వీకే యాదవ్ తెలిపారు.

రైల్వే బోర్డు చైర్మన్ పదవీకాలం పెంపు
రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ పదవీ కాలం మరో ఏడాది పొడిగించారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆయన పదవీకాలం పొడిగింపును ఆమోదించింది. తాజా నిర్ణయంతో 2020 జనవరి 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. 2019 జనవరి 1న వీకే యాదవ్ రైల్వే బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని వార్తలు