హిమాచల్‌ ప్రదేశ్‌లో మొదలైన పోలింగ్‌

9 Nov, 2017 10:30 IST|Sakshi

తొలిసారి ఓటర్‌ వెరిఫైడ్‌ స్లిప్స్‌

ఓటేసిన సీఎం వీరభద్ర సింగ్‌

క్యూ లైన్లలో బారులు తీరిన ప్రజలు

సాక్షి, సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో తిరిగి విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా ఓటేసిన అనంతరం ఆయన ట్విటర్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. హిమాచల్‌ ప్రజలు తమ పాలనపై సంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసిందని ఆయన అన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ కూడా పోలింగ్‌ మొదలైన తొలి గంటలోనే తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఇదిలా ఉండగా హిమాచల్‌ ఎన్నికల్లో ఈ దఫా తిరిగి అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ప్రజలు అభివృద్ధి పట్టం కడతారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు.. ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఈ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌,  ఎలాగైనా పవర్‌లోకి రావాలనీ బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఇరు పార్టీలు మొత్తం 68 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టాయి. హిమాచల్‌ ప్రదేశ్‌కు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు.

  • కాంగ్రెస్‌, బీజేపీలు మొత్తం 68 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాయి. మొత్తం 337 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 62 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరోదఫా తమ భవిష్యత్‌ను పరీక్షించుకుంటున్నారు.
  • మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీ 42 స్థానాల్లో పోటీ చేస్తోంది. సీపీఎం 14, సీపీఐ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి.
  • ఎన్నికల సంఘం 7,525 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 50.25 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
  • మొత్తం అభ్యర్థుల్లో అందరి చూపు ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌, బీజేపీ నేత పీకే ధుమాల్‌ మీదే ఉంది.
  • ఎన్నికలు ముగిసిన 40 రోజుల తరువాత అంటే డిసెంబర్‌ 18న ఫలితాలు వెలువడతాయి.
  • సీఎం వీరభద్ర సింగ్‌ అవినీతిపై బీజేపీ తీవ్ర ప్రచారం చేసింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పెద్దనోట్ల రద్దు, జీఎస్టీపై ప్రచారం నిర్వహించాయి.
  • కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మూడు సభల్లో పాల్గొనగా, ప్రధాని నరేంద్ర మోదీ రెండు బహిరంగ సభల్లో పాల్గొన్నారు.    
  • ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటర్‌ వెరిఫైడ్‌ ఆడిట్‌ ట్రయిల్స్‌ను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది.
  • ఎన్నికల భధ్రత కోసం 17,850 మంది రాష్ట్ర పోలీసులను, 65 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది.
  • గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 36 సీట్లు సాధించగా బీజేపీ 26 స్థానాల్లో గెలుపొందింది.
>
మరిన్ని వార్తలు