ముఖంపై కాలుతున్న కాలుతున్న సిగరెట్ల విసరేవాడు

23 Jul, 2014 03:26 IST|Sakshi
ముఖంపై కాలుతున్న సిగరెట్లు విసిరేవాడు

వాడియాపై ప్రీతి జింటా సంచలన ఆరోపణలు
 
ముంబై: మాజీ ప్రియుడు, పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల చేసిన వేధింపుల ఆరోపణల్లో సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మే 30న ముంబై స్టేడియంలో జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు ప్రీతి జింటా జూన్ 12న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు ముందే వాడియా తనను ఎన్నోసార్లు వేధింపులకు గురిచేసినట్లు ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు జూన్ 30న (విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ) అందించిన లేఖలో ప్రీతి పేర్కొన్నారు. తన ముఖంపై వాడియా కాలుతున్న సిగరెట్లను విసరడం, గదిలోపెట్టి తాళం వేయడం వంటి దురాగతాలకు పాల్పడిన వైనాన్ని లేఖలో ప్రీతి ప్రస్తావించారు.

తాను శాంతియుతంగా జీవించేందుకు వాడియాను తన నుంచి దూరంగా ఉంచాలని ప్రీతి పోలీసులను వేడుకున్నారు. లేకపోతే ఏదో ఒక రోజు వాడియా తనను చంపుతాడేమోనని భయపడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. వాడియాకు హాని చేయాలన్న ఉద్దేశం తనకు లేనప్పటికీ తన భద్రత దృష్ట్యా గత్యంతరం లేకే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని లేఖలో చెప్పుకొచ్చారు. ప్రీతి జింటా ఆరోపణలను వాడియా గతంలోనే తోసిపుచ్చగా తాజాగా వెలుగు చూసిన ఆరోపణలపై స్పందించేందుకు వాడియా గ్రూపు ప్రతినిధులెవరూ అందుబాటులోకి రాలేదు. ప్రీతి జింటా, నెస్ వాడియాలు ఐపీఎల్ క్రికెట్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సహ యజమానులుగా ఉన్న విషయం తెలిసిందే.
 
 

మరిన్ని వార్తలు