ఇంద్రాణికి ఉరి శిక్ష విధించండి!

2 Sep, 2015 01:42 IST|Sakshi
ఇంద్రాణికి ఉరి శిక్ష విధించండి!

షీనా బోరా తండ్రి సిద్ధార్థ్ దాస్
 ముంబై/కోల్‌కతా: కన్నతల్లి చేతిలో హత్యకు గురైనట్లు భావిస్తున్న షీనా బోరా తన సొంత కూతురేనని మంగళవారం కోల్‌కతాకు చెందిన సిద్ధార్థ్ దాస్ వెల్లడించారు. డీఎన్‌ఏ పరీక్షకు తాను సిద్ధమేనన్నారు. షీనా హత్యకేసులో కీలక నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా తనకు కాలేజీ రోజుల్లో పరిచయమని, అధికారికంగా పెళ్లి చేసుకోలేదని, ఆమెతో 1986 నుంచి 1989 వరకు సహజీవనం చేశానని దాస్ చెప్పారు. తన కూతురు షీనా హత్య వార్త విని ఎంతో వేదన చెందానన్నారు. షీనాను  ఇంద్రాణే హత్య చేసుంటే, ఆమెకు ఉరి శిక్ష విధించాల్సిందేనన్నారు. ఇంద్రాణికి మొదట్నుంచి డబ్బు పట్ల వ్యామోహం ఎక్కువేనని, తన మధ్య తరగతి ఆర్థిక స్థాయి భరించలేకే తనను వదిలి వెళ్లిపోయి ఉండొచ్చన్నారు.  కోల్‌కతాలో సిద్ధార్థ్ మీడియాతో మాట్లాడుతూ.. 1989 తరువాత ఇంద్రాణితో సంబంధాలు తెగిపోయాయని, తన కూతురు షీనాతో మాత్రం ఆమె పదోతరగతిలో ఉండగా ఒకసారి మాట్లాడానన్నారు.

మీడియా ద్వారానే  షీనా హత్య విషయం తెలిసిందని, ముంబై పోలీసులు తనను సంప్రదించలేదని, దర్యాప్తునకు సహకరిస్తానని  చెప్పారు. పిల్లలను ఇంద్రాణి తల్లిదండ్రులు చూసుకునేవారని, పిల్లల సంరక్షణ బాధ్యతను తనకివ్వడానికి వారు ఒప్పుకోలేదన్నారు. ఇంద్రాణి ఈ హత్య చేశారని నమ్ముతున్నారా? అన్న ప్రశ్నకు నేటి సమాజంలో ఎవరు ఎవర్నైనా హత్య చేయొచ్చన్నారు.  కాగా, ఇంద్రాణి, ఆమె కుమారుడు మిఖైల్ బోరాల డీఎన్‌ఏతో పోల్చి చూసే ఉద్దేశంతో మహారాష్ర్టలోని అడవిలో షీనా బోరా మృతదేహాన్ని తగలబెట్టిన చోట పోలీసులు స్వాధీనం చేసుకున్న అస్థిపంజర అవశేషాలను ముంబైలోని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించారు.

మరిన్ని వార్తలు