‘మేకిన్ ఇండియా’ విమానాలు కావలెను

30 Oct, 2016 00:42 IST|Sakshi
‘మేకిన్ ఇండియా’ విమానాలు కావలెను

- 200 వరకు కొనుగోలుకు భారత్ యత్నాలు
- స్పందించిన అమెరికా, స్వీడన్ కంపెనీలు
 
 న్యూఢిల్లీ:  స్థానిక భాగస్వామితో తమ దేశంలో తయారుచేస్తే 200 విదేశీ యుద్ధ విమానాల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు భారత వాయుసేన ప్రకటించింది. వీటి విలువ  15 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా. ఇది దేశ అతిపెద్ద రక్షణ ఒప్పందం కాగలదు. సోవియట్ కాలం నాటి విమానాలను పూర్తిగా అటకెక్కిస్తే భారత్‌కు 300 సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానాలు అవసరమవుతాయి.  ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ విమానాలను కొననున్న భారత్ ఇతర మార్గాల నుంచి మరిన్ని సమాకూర్చుకోవాలని సంకల్పించింది.   పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలను దీటుగా ఎదుర్కోవాలంటే ఇకపై సేకరించే యుద్ధ విమానాలను స్వదేశంలో ఉత్పత్తి చేసి దిగుమతులకు కళ్లెం వేయడమే మార్గమని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియలో విదేశీ కంపెనీల నుంచి సాంకేతికత బదిలీ కీలకం. ఈ మేరకు ఇప్పటికే పలు విదేశీ కంపెనీలతో చర్చలు ప్రారంభించారు.  

 సిద్ధమంటున్న విదేశీ కంపెనీలు:  భారత్‌లో ఎఫ్-16 విమానాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని, భారత సైన్యం అవసరాలు తీర్చడమే కాకుండా వాటిని విదేశాలకూ ఎగుమతి చేస్తామని అమెరికా కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ తెలిపింది. ప్రత్యేకంగా ఇలాంటి విమానాలనే తయారుచేస్తే భవిష్యత్తులో భారత్ వీటికి కేంద్రంగా మారగలదని భారత్‌కు  తెలిపింది.  స్వీడన్ కంపెనీ సాబ్ కూడా తన గ్రైపెన్  విమానాల తయారీకి భారత్‌లో యూనిట్ నిర్మిస్తామని ప్రకటించింది. నాలుగో తరం యుద్ధ విమానాలు కావాలని భారత్ కోరిందని సంస్థ చైర్మన్ వైడర్‌స్ట్రామ్ చెప్పారు. ముందస్తు షరతులు లేనందు వల్ల తమ యూనిట్‌లో కనీసం 100 విమానాలను తయారుచేయగలమన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బోయింగ్ కూడా ఎఫ్ ఏ-18 హార్నెట్‌లను ఇవ్వడానికి అంగీకరించినా సాంకేతికత బదిలీపై ఎలాంటి హామీ లభించలేదు.

 సాంకేతికత లేమే లోపం:  ‘రక్షణ రంగ సాంకేతికతపై భారత్‌కు పట్టులేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అగ్ర దేశాల నుంచి  పూర్తిగా లేదా గణనీయంగా సాంకేతికత బదిలీ జరిగితే భవిష్యత్తు అభివృద్ధికి పునాది పడుతుంది’ అని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఎం మాతేస్వరణ్ అభిప్రాయపడ్డారు. దశాబ్దాలుగా జరిగిన ఆలస్యాన్ని భర్తీ చేయడానికి భారత్ 200కు పైగానే విమానాలను తయారుచేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు