వేసవిలో చల్లగా.. శీతాకాలం వెచ్చగా..!

18 Apr, 2015 01:56 IST|Sakshi
వేసవిలో చల్లగా.. శీతాకాలం వెచ్చగా..!

ఎండాకాలం ఎండలు. వానాకాలం వానలు. చలికాలం చలి.. కాలం ఏదైనా మనిషికి కష్టాలు మాత్రం కామనే! అందుకే అన్ని కాలాల్లోనూ సౌకర్యంగా ఉండే ఇల్లుంటే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. అలాంటి వారి కోసం డిజైన్ చేసిందే ఈ ‘ఆల్‌వాటర్’ హోమ్! ఈ ఇల్లు వేసవిలో చల్లగా ఉంటుంది. చలికాలం వెచ్చగా ఉంటుంది! కరెంటు అవసరాన్ని చాలావరకూ తగ్గిస్తుంది కూడా!
 
బయటి వాతావరణంతో సంబంధం లేకుండా లోపల ఎల్లప్పుడూ మనకు అనుకూలమైన వాతావరణమే ఉండే ఈ ఆల్‌వాటర్  ఇల్లును హంగేరికి చెందిన డాక్టర్ మత్యాస్ గుటాయ్ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు. ఇంటి గోడల్లో ఇటుకలకు బదులుగా గాజు, స్టీలుతో చేసిన ప్యానెళ్లను అమర్చే ఈ పద్ధతికి ఆయన ‘ఆల్‌వాటర్ టెక్నాలజీ’ అని పేరుపెట్టారు. దీనినే ‘లిక్విడ్ ఇంజనీరింగ్’గానూ పిలుస్తున్నారు. ఈ పద్ధతిలో ఓ చిన్న ప్రొటోటైప్(ప్రాథమిక నమూనా) ఇంటిని ఆయన నిర్మించారు.  
 
గోడల్లో నీరు!

ఆల్‌వాటర్ ఇల్లు నిర్మాణం కోసం ప్రత్యేకంగా రూపొందించిన గ్లాస్, స్టీలు ప్యానెళ్లతో గోడలను నిర్మిస్తారు. పైకప్పులోనూ ఇవే ప్యానెళ్లు ఉంటాయి. రెండు రెండు ప్యానెళ్లను దగ్గరగా కలిపి అమర్చడం వల్ల వీటి మధ్యలో సన్నటి ఖాళీ ఏర్పడుతుంది. ఈ ప్యానెళ్లన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. వీటిలో నీరు, ప్రత్యేక  ద్రవం, వాయువులను నింపుతారు. దీంతో అన్ని ప్యానెళ్లలోని నీరు కలిసిపోయి ఉంటుంది. దీనివల్ల ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్యానెళ్లలోని నీటి ఉష్ణోగ్రత ఇల్లంతా ఒకే స్థాయిలో ఉంటుంది. ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉన్నప్పుడు కూడా వీటిన్నింటిలో సమ ఉష్ణోగ్రత ఉంటుంది. అందువల్ల ఇంటిలో కూడా సమ ఉష్ణోగ్రతతో కూడిన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు అందిన వేడిని  స్టీలు ప్యానెళ్లు బయటికి పోనివ్వకుండా నిల్వ చేసుకుంటాయి. ఉష్ణోగ్రతలు పడిపోయి వాతావరణం చల్లగా మారినప్పుడు ఆ వేడిని ఇంటిలోపలివైపు విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియను మెకానికల్‌గా కూడా నియంత్రించవచ్చట. భలే ఇల్లు కదూ!
 

మరిన్ని వార్తలు