-

మహిళా ఎమ్మెల్యే ఫిర్యాదు, కేంద్రమంత్రికి వారెంట్‌

10 Mar, 2017 19:26 IST|Sakshi
కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు వారెంట్‌

కోల్‌కతా : కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోకు వారెంట్‌ జారీ అయింది. ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఆయన కోర్టుకు గైర్హాజరు కావడంతో ఈ వారెంట్‌ జారీ అయింది. కాగా కేంద్రమంత్రి అనుచిత వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదుతో కోల్‌కోతా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

కాగా జనవరిలో జరిగిన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మహిళల మనోభావాలను కించపరిచేలా బాబుల్‌ సుప్రియో వ్యాఖ్యలు చేశారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మహువా మైత్రా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనపట్ల కేంద్రమంత్రి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె జనవరి 4వ తేదీన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేంద్రమంత్రిపై కేసు నమోదు చేసి అలిపోరీ కోర్టులో ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. అలాగే టీవీ చర్చ కార్యక్రమం ఫుటేజ్‌ కూడా కోర్టుకు సమర్పించారు. 

అయితే అంతకు ముందు దీనిపై కేంద్రమంత్రిని పోలీసులు మూడుసార్లు వివరణ కోరినా ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేదని సమాచారం. మరోవైపు దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ 'వాళ్లు ఏం చేసుకుంటారో అది చేసుకోనివ్వండి. దీనిపై నేను చెప్పేది ఏమీ లేదు' అని అన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు