నిలువెల్లా చలించాను

28 Dec, 2013 02:44 IST|Sakshi
నిలువెల్లా చలించాను

గోద్రా ఘర్షణలపై మోడీ
మాటలకందని యాతన అనుభవించాను
‘దేశ ప్రజలను ఉద్దేశించి’ వ్యాఖ్యలు
కోర్టు క్లీన్‌చిట్‌ను విజయంగా చూడటం లేదు
ముస్లింల ఊచకోతపై క్షమాపణ మాత్రం చెప్పని వైనం


 అహ్మదాబాద్: ‘గోద్రా అనంతర అల్లర్లు నన్ను అంతులేని మనోవేదనకు గురి చేశాయి’ - దేశాన్ని కుదిపేసిన 2002 నాటి గుజరాత్ మత ఘర్షణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తాజాగా చేసిన వ్యాఖ్యలివి! అంతేకాదు, ‘‘ఆ అమానుష కాండను చూసి నేను ఆపాదమస్తకం చలించిపోయాను. అంతటి ఘోరాన్ని కళ్లారా చూసిన మీదట నాలో అంతులేని శూన్యం ఆవరించింది. అప్పటి నా మనోగతాన్ని వివరించేందుకు బాధ, ఆవేదన, ఆక్రోశం, వ్యథ, యాతన, దుఃఖం వంటి పదాలు ఎంతమాత్రమూ సరిపోవు’’ అని కూడా అన్నారాయన! వందలాది మంది ముస్లింలను బలిగొన్న ఆ ఘర్షణలపై మోడీ ఇలా స్పందించడం ఇదే తొలిసారి. పైగా, ‘‘నేను అనుభవించిన ఈ నరకయాతనంతా చాలదన్నట్టుగా.. నేనెంతగానో ప్రేమించే నా తోటి గుజరాతీల మరణానికి, దురవస్థకు నన్నే బాధ్యుడిని చేస్తూ ఆరోపణలు గుప్పించారు. ఏ దారుణాలైతే నన్ను లోలోతుల్లోంచి కుదిపేశాయో, వాటికి ఏకంగా నన్నే బాధ్యుడిని చేస్తే అది నన్నెంతటి షాక్‌కు గురి చేసి ఉంటుందో, నాలో ఎంతటి వేదన నింపి ఉంటుందో ఊహించగలరా!’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు.

గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం మోడీకి ఇచ్చిన క్లీన్‌చిట్‌ను అహ్మదాబాద్ కోర్టు గురువారం సమర్థించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోద్రా ఉదంతంపై మోడీ శుక్రవారం తన బ్లాగ్‌లో 1,000 పదాలున్న సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అంతేగాక తీర్పుతో తాను విముక్తుణ్నయ్యానని భావిస్తున్నానని, తనకు ప్రశాంతత కూడా లభించిందని అన్నారు. అయితే  తీర్పును వ్యక్తిగత విజయంగానో, పరాజయంగానో చూడటం లేదన్నారు. తన మిత్రులతో పాటు శత్రువులను కూడా అదే కోరుతున్నానన్నారు. ‘కోర్టు తన తీర్పు వెలువరించిన నేపథ్యంలో నేనూ నా మనసు లోతుల్లోని భావాలను, అభిప్రాయాలను దేశమంతటితో పంచుకోవడం ముఖ్యం.వ్యక్తిగత స్థాయిలో అప్పట్లో తాను ఎదుర్కొన్న ఈ అత్యంత విషమ పరీక్షను ఇలా తొలిసారిగా మీ అందరితో పంచుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.

‘నిజమైన మోడీని అర్థం చేసుకోవడానికి, అతనికి చేరువ కావడానికి ఎంతోమంది చేస్తున్న ప్రయత్నాలను కోర్టు తీర్పు మరింత సులభతరం చేస్తుందని ఆశిస్తున్నాను’ అనీ పేర్కొన్నారు. ఏ సమాజం, రాష్ట్రం, దేశం భవితవ్యమైనా సామరస్యంలోనే దాగుందన్నది తన అచంచల విశ్వాసమన్నారు. ప్రగతికి, అభివృద్ధికి అదే పునాదిరాయి అని అభివర్ణించారు. కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరుబడ్డ మోడీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ముస్లింల సానుభూతి పొందే ప్రయత్నంలో భాగంగానే ఈ వివరణ ఇచ్చారని భావిస్తున్నారు. అయితే గోద్రా అనంతర అల్లర్లలో చోటుచేసుకున్న సామూహిక హత్యాకాండకు ఆయన క్షమాపణలు మాత్రం చెప్పకపోవడం విశేషం. పైగా గోద్రా హింసాకాండపై అప్పటిదాకా దేశంలో ఎవరూ ఎప్పుడూ స్పందించనంత వేగంగా, తమ ప్రభుత్వం స్పందించిందని మోడీ వాదించారు. మోడీ తన బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యల సారాంశం ఆయన మాటల్లోనే...

 ప్రియమైన సోదర సోదరీమణులకు...

 అంతిమంగా సత్యమే జయిస్తుందన్నది ప్రకృతి సూత్రం. 2001లో గుజరాత్‌ను అతలాకుతలం చేసి వందలాది ప్రాణాలను బలిగొని, వేలాది మందిని నిరాశ్రయులను చేసిన తీవ్ర భూకంపం తాలూకు దెబ్బ నుంచి తేరుకోకముందే 2002లో రాష్ట్రంలో మతిలేని హింస చోటుచేసుకుంది. ఆ దారుణంలో అమాయకులు హత్యకు గురయ్యారు. ఎన్నో కుటుంబాలు అనాథలయ్యాయి. ఏళ్ల తరబడి అంతులేని శ్రమకోర్చి నిర్మించుకున్న ఆస్తులు నేలమట్టమయ్యాయి. దాన్ని చూసి ఎంతగా  చలించిపోయానో వర్ణించేందుకు మాటలు చాలవు. ఒకవైపు భూకంప బాధితుల వ్యథ. మరోవైపు అల్లర్ల బాధితుల దైన్యం. అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా శాంతిస్థాపన, పునరావాసం, బాధితులకు న్యాయం చేయడం అనే లక్ష్యాలపైనే పూర్తిగా దృష్టి సారించాను. ఆ క్రమంలో వ్యక్తిగతంగా నన్ను దహించివేస్తున్న అంతులేని బాధను, ఆవేదనను నాలోనే అదిమి పెట్టుకున్నాను.

అందుకోసం దేవుడు నాకిచ్చిన శక్తియుక్తులన్నింటినీ కూడదీసుకోవాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నవారికి సొంత బాధను, ఆవేదనను అందరితో పంచుకునే స్వేచ్ఛ, హక్కు ఉండవంటూ మన శాస్త్రాలు చేసిన బోధను ఆ పరీక్షా సమయంలో  మననం చేసుకుంటూ సాంత్వన పొందాను. అధికారంలో ఉన్నవారు ఎప్పుడూ ఒంటరిగా కుమలాల్సిందే. అందుకే తీవ్ర ఆవేదనామయం, భయానకమూ అయిన ఆ చేదు అనుభవాన్ని  ఒంటరిగానే భరించాను. ఆ భయానక రోజులు ఎప్పుడు గుర్తుకొచ్చినా  దేవుణ్ని ప్రార్థించేది ఒక్కటే . అలాంటి క్రూర, దురదృష్టకర రోజులను మరే వ్యక్తీ, సమాజమూ, రాష్ట్రమూ, దేశమూ చవిచూడకుండు గాక! గోద్రాలో రైలు కాలి బూడిదైన రోజున కూడా... శాంతి, సహనం పాటించాలంటూ సరిగ్గా ఇవే భావోద్వేగాల నడుమ  గుజరాతీలందరికీ పిలుపునిచ్చాను. అమాయకుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టొద్దని కోరాను. శాంతిని స్థాపించి బాధితులకు న్యాయం చేయడంతో పాటు హింసాకాండకు బాధ్యులను శిక్షించడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, రాజకీయ సంకల్పం కూడానని ప్రకటించాను. నాలోని ఈ లోతైన భావాలు ఇటీవలి సద్భావనా దీక్షల్లో నేను చేసిన ప్రసంగాల్లో కూడా మీకు అడుగడుగునా కనిపిస్తాయి. గోద్రా అనంతర ఘోరాలు నన్ను బాగా బాధించాయని, ఇలాంటి గర్హనీయ ఉదంతాలు సభ్య సమాజానికి ఎంతమాత్రమూ తగినవి కావని దీక్షల్లో చెప్పాను.

 నాకిప్పుడు సంతృప్తిగా ఉంది: నేనెప్పుడూ సమైక్యతా స్ఫూర్తిని పెంచేందుకే ప్రాధాన్యమిచ్చాను. కానీ ఇన్నేళ్లుగా ప్రత్యర్థులు మాత్రం నాపై తీవ్ర దాడి చేశారు. నన్ను అప్రతిష్టపాలు చేసే క్రమంలో గుజరాత్‌తో పాటుదేశ ప్రతిష్టనే మసకబార్చారు. అల్లర్ల బాధితులకు న్యాయం ఈ బురదజల్లుడు వల్లే ఆలస్యం కావడం బాధాకరం. అప్పటికే నరకయాతన అనుభవించిన ప్రజలపై తాము మరెంతటి వేదనను రుద్దుతున్నదీ వారు బహుశా గమనించలేకపోయారు. కానీ గుజరాత్ హింసకు బదులు శాంతిని, విభజనవాదానికి బదులు ఐక్యతను, ద్వేషానికి బదులు సామరస్యాన్ని ఎంచుకుని సాగింది. నిత్యం అనిశ్చితి, భయంతో కూడిన రోజుల నుంచి శాంతి, ఐక్యత, సద్భావనలను సాధించే దిశగా సాగింది. నాకిప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంది. ఈ ఘనత ప్రతి గుజరాతీదీ.

 నిజం నిగ్గుతేలింది

 దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అత్యంత సునిశిత తనిఖీ నడుమ సాగిన విచారణ ప్రక్రియ నిన్నటి కోర్టు తీర్పుతో ముగిసినట్టయింది. నాపై అడుగడుగునా అబద్ధాలు, మోసాలతో కూడిన దాడి జరిగిన ఈ పరీక్షా కాలంలో నాకు దన్నుగా నిలిచిన వారందరికీ రుణపడి ఉన్నాను. ఇతరులకు వేదన కలిగించడం ద్వారా తృప్తి, మానసికానందం పొందేవారు బహుశా ఇకపై కూడా నాపై దాడిని ఆపబోరేమో. అలా ఆపుతారని నేననుకోను కూడా. కానీ ఆ క్రమంలో 6 కోట్ల మంది గుజరాతీలపై కూడా బాధ్యతారహితంగా బురదజల్లడాన్ని మాత్రం వారు ఇకనైనా మానుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరి ముఖాలపైనా నవ్వులు చూసే దిశగా చేతులు కలపాల్సిందిగా అందరినీ కోరుతున్నాను.
 

మరిన్ని వార్తలు