మొదటి మహిళా చెత్త ట్రక్ డ్రైవర్..!

25 Jan, 2016 19:34 IST|Sakshi
మొదటి మహిళా చెత్త ట్రక్ డ్రైవర్..!

చెత్త ఏరుకోవడంతో మొదలైన ఆమె జీవితం... ఇప్పుడు ఓ నగరంలో తొలి మహిళా ట్రక్ డ్రైవర్ స్థాయికి చేరింది. ఆత్మ విశ్వాసంతో ఆమె వేసిన ప్రతి అడుగూ అభివృద్ధి పథంలో నడిపించింది. ఇరుగు పొరుగు సాయం కూడా అందడంతో లక్ష్యాన్ని చేరుకోగలిగింది. 'హసరు డాల' అనే సంస్థ కూడా ఆమెకు వెన్నుదన్నుగా నిలిచింది. హసరు డాల అనే సంస్థ బెంగళూరులో చెత్త ఏరుకునే వారి జీవితాలను బాగుచేసేందుకు పనిచేస్తోంది. ఇప్పుడు ఇదే సంస్థ బెంగళూరుకు చెందిన లక్ష్మి అనే ఓ మహిళ జీవితంలో వెలుగులు నింపింది. కెంపెగౌడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో హౌస్ కీపింగ్ వర్కర్ గా పనిచేస్తున్న లక్ష్మికి చేయూతనిచ్చింది.

చెత్తను ఏరుకొంటూ బతుకు బండిని ఈడుస్తున్న లక్ష్మికి.. ముగ్గురు పిల్లలు. చిన్న వయసులోనే వివాహం ఆమెకు వివాహం అయింది. భర్త మద్యానికి బానిస కావడంతో  తీవ్ర కష్టాలను ఎదుర్కొంటుంది. కూతురు ప్రతిభ కూడ స్కూల్ డ్రాపవుట్ గా మారింది. దీంతో 15 ఏళ్ళ వయసున్న ప్రతిభను కూడ లక్ష్మి హసిరు డాలలో చేర్పించింది. అక్కడ ఆమె కుట్టు పనిలో శిక్షణ పొందుతోంది. ఇద్దరు కొడుకుల్లో పన్నెండేళ్ళ ధనుష్, పదేళ్ళ ఆకాష్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే, చెత్త ఏరుకునే లక్ష్మికి ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆశ ఉండేది.

కానీ డ్రైవింగ్ స్కూల్ కు ఫీజు కట్టలేకపోవడంతో ఆమెకు తెలిసిన ఓ మహిళ ద్వారా హసిరు డాల సంస్థలో చేరి డ్రైవింగ్ నేర్చుకోవడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందింది. అంతేకాకుండా త్వరలో బెంగళూరు నగరంలోనే మొదటి మహిళా చెత్తలారీ డ్రైవర్గా మారనుండటంతో ఆమె ఎంతో సంతోషిస్తోంది. ప్రస్తుతం లక్ష్మి ఒక టన్ను బరువైన ట్రక్ నడిపేందుకు డ్రైవింగ్ లో శిక్షణ పొందింది. వాణిజ్య పరమైన వాహనాలను నడిపేందుకు అనుమతిని పొందాల్సి ఉంది.

చెత్త ఏరుకునే తనకు హసరుడాల సంస్థ సహకారం అందించడం వల్లే తన కల నెరవేరిందని చెప్తోంది. బెంగళూరుకు చెందిన హసిరుడాల సంస్థ వ్యర్థ పదార్థాలను సేకరించే కార్మికులకు చేయూతనిచ్చి వారిని వేస్ట్ మేనేజ్మెంట్ ఉద్యోగులుగా మార్చేందుకు కృషి చేస్తోంది. అంతేకాదు నగరంలో వ్యర్థ పదార్థాల నిర్వహణ సేవలను కూడా అందిస్తోంది. స్థానిక కార్మికులు విభజించిన వ్యర్థాలను సేకరించి, వాటిని ప్రాసెసింగ్ యూనిట్లకు రవాణా చేస్తోంది.

మరిన్ని వార్తలు