వారు చనిపోయినట్లు టీవిలోనే చూశాను

20 Mar, 2018 18:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇరాక్‌లో 30 మంది భారతీయులు చనిపోయారంటూ రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ చేసిన ప్రకటనపై వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. తమ వారు చనిపోయారని నేరుగా రాజ్యసభలో ఎలా ప్రకటిస్తారని వారు తప్పుపడుతున్నారు. సుష్మా తీరు తమను తీవ్రంగా బాధించిందని కుటుంబసభ్యులు తెలిపారు. 2014లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ అపహరించిన 39 మంది భారతీయుల్లో.. 30 మంది చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని కేంద్ర మంత్రి సుష్మా చేసిన ప్రకటన చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని, తన తమ్ముడు కూడా మృతి చెందాడన్న వార్తను నమ్మలేకపోతున్నామని మృతుడి సోదరి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. సుష్మా ముందుగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు.

‘సుష్మా ప్రకటనను నేను టీవిలో చూశాను. వారు మృతి చెందారన్న వార్త మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నా సోదరుడు మజీందర్‌ సింగ్‌ ఫోన్‌ను మైసూల్‌లో  స్వాధినం చేసుకున్నారు. అతన్ని ఐసిస్‌ చంపి ఉంటుందని అనుకుంటున్నాం’ అని గుర్విందర్‌ కౌర్‌ తెలిపారు. గత నాలుగేళ్లుగా వారు బ్రతికే ఉన్నారని మంత్రి తమతో చెప్తూ  వచ్చారని, కానీ ఎప్పుడూ ఒక్క ఆధారం చూపలేదని ఆమె తప్పుబట్టారు. ఈ విషయమై సుష్మా స్వరాజ్‌తో మాట్లాడానికి వేచిచూస్తున్న సమయంలోనే వారు మృతి చెందారని పార్లమెంట్‌లో ప్రకటించడంతో షాక్‌తిన్నామని చెప్పారు. తమ కుటుంబసభ్యులు మృతి చెందారన్న వార్త ముందుగా తమకు కాకుండా బయటి ప్రపంచానికి తెలిపారని సుష్మా తీరును తప్పబట్టారు.

ఇరాక్‌లో భారతీయులు చనిపోయారన్న పక్కా సమాచారంతోనే పార్లమెంట్‌లో ప్రకటన చేస్తున్నట్లు సుష్మా తెలుపగా.. దీనిపై గుర్విందర్‌ కౌర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతదేహాలు స్వాధీనం చేసుకున్న తరువాత కూడా తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే, ఈ విమర్శలపై స్పందించిన సుష్మా.. ముందుగా పార్లమెంట్‌కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే పార్లమెంటులో ప్రకటన చేశామని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు