త్రిభాషా సూత్రానికి కట్టుబడి ఉన్నాం..

24 Apr, 2017 02:24 IST|Sakshi
త్రిభాషా సూత్రానికి కట్టుబడి ఉన్నాం..
టీనగర్‌: కేంద్ర ప్రభుత్వం త్రిభాషా సూత్రానికి కట్టుబడి ఉందని, అదే సమయంలో హిందీ నేర్చుకోమని ఎవరినీ బలవంతపెట్టమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. మాతృభాష, ఆంగ్లంతోపాటు హిందీ నేర్చుకుంటే మంచిదని అన్నారు. తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్‌ను త్వరలో నియమిస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. చెన్నైలో ఆదివారం రామానుజర్‌ సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా సమతా పాదయాత్ర , తమిళనాడు చలనచిత్ర వాణిజ్యమండలి, నిర్మాతల కౌన్సిల్, శ్రీరామచంద్ర యూనివర్సిటీలో 25వ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్య చికిత్సలందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందుకోసం టెలిమెడిసిన్‌ సెంటర్లు ఏర్పాటు కానున్నట్లు పేర్కొన్నారు. అలాగే 24 గంటలపాటు ప్రజలు వైద్యులతో అందుబాటులో ఉండేందుకు నేషనల్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటుకానున్నట్లు తెలిపారు. వర్సిటీ స్నాతకోత్సవంలో మెరిట్‌ విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ బహూకరించారు. ఎంబీబీఎస్‌లో ఆల్‌రౌండ్‌ మెరిట్‌ సాధించిన  డాక్టర్‌ ఉమా రవిశంకర్‌కు ఐదు గోల్డ్‌ మెడల్స్‌ అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ చాన్సలర్‌ వీఆర్‌ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు