రాష్ట్రాల విభజనకు మేం వ్యతిరేకం

8 Oct, 2013 03:55 IST|Sakshi

న్యూఢిల్లీ: చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ స్పష్టంచేశారు. చిన్న రాష్ట్రాల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయని, పెద్ద రాష్ట్రాల నుంచి విడిపోయిన రాష్ట్రాలు విజయవంతం కాలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర అనంతరం చిన్న రాష్ట్రాలపై ములాయం మాట్లాడడం ఇదే తొలిసారి. ‘చిన్న రాష్ట్రాల్లో వనరుల కొరత వల్ల సమస్యలు తలెత్తుతాయి. నక్సలిజం మరో ముఖ్యమైన సమస్య. చిన్న రాష్ట్రాల్లో ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. మా పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకం’ అని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి హరితప్రదేశ్‌ను విడదీయాలని ఆర్‌ఎల్‌డీ నేత, కేంద్రమంత్రి అజిత్‌సింగ్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న తెలంగాణపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న రోజున.. ఆ మంత్రివర్గ భేటీలో అజిత్‌సింగ్ హరితప్రదేశ్ డిమాండ్‌ను లేవనెత్తినట్టు సమాచారం.  యూపీ విభజనకు ఆర్‌ఎల్‌డీ, బీఎస్పీ అనుకూలంగా ఉండగా.. ఎస్పీ వ్యతిరేకిస్తోంది.

మరిన్ని వార్తలు