మీ డిమాండ్లన్నీ నెరవేర్చా.. వచ్చి పనిలో చేరండి!

15 Jun, 2019 19:14 IST|Sakshi

కోల్‌కతా: గత ఐదు రోజులుగా జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న ఆందోళనలతో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. ఆందోళన చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు, డాక్టర్ల డిమాండ్లన్నింటినీ నెరవేరుస్తామని, వెంటనే ఆందోళన విరమించి.. విధుల్లో చేరాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. శనివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. వైద్యులకు వ్యతిరేకంగా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని ఆమె హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న వైద్యులకు భద్రత, సహకారం అందిస్తామని, డాక్టర్లపై దాడులు చేసిన వారిని అరెస్టు చేసి జైల్లో వేస్తామని ప్రకటించారు. డాక్టర్ల ఆందోళన విషయంలో ఒకవైపు వాదాన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారని, ఆందోళన చేస్తున్న వైద్యులు ప్రభుత్వ ప్రతినిధులతో అసభ్యంగా ప్రవర్తించారని, అయినా వైద్యుల పట్ల తమ ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించిందని తెలిపారు. డాక్టర్లను తాము టార్గెట్‌ చేయడం లేదని, వారిని కాపాడేందుకే తాము ప్రయత్నిస్తున్నామని ఆమె వెల్లడించారు. 

గతవారం కోల్‌కతా మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో 85 ఏళ్ల వ్యక్తి చనిపోవడంతో వారి బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసి.. దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బందితోపాటు పలువురు జూనియర్‌ డాక్టర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని జూడాలు కోరగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిగా స్పందించకపోవడంతో వైద్యుల నిరసన తీవ్రతరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇంకా పెద్దది కాకుండా చూడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఇప్పటికే మమతకు సూచించారు. అంతేకాకుండా విధుల్లో ఉన్న వైద్యులకు తగిన రక్షణ కల్పించాలంటూ ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. బెంగాల్‌లో వైద్యుల ఆందోళనపై నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మరోవైపు ఆందోళనకు దిగిన జూడాలను చర్చలకు మమత ప్రభుత్వం ఆహ్వానించగా జూడాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ఆందోళన చేస్తున్న జూడాల డిమాండ్లన్నింటికీ అంగీకరిస్తున్నట్టు మమత ప్రభుత్వం ప్రకటించింది.
 

>
మరిన్ని వార్తలు