చేతులు పైకెత్తమన్నారు.. నేరస్తుల్లా చూశారు!

16 Dec, 2019 10:35 IST|Sakshi
క్యాంపస్‌ నుంచి బయటకు వస్తున్న జామియా విద్యార్థులు

న్యూఢిల్లీ: చేతులు పైకెత్తి  క్యాంపస్‌ నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ పోలీసులు మమ్మల్ని ఆదేశించారు. నిజానికి మేం ఆందోళనలు జరిగిన ప్రదేశానికి వెళ్లలేదు. ఆ సమయంలో క్యాంపస్‌లో ఉన్నాం. అయినా పోలీసులు మమ్మల్ని నేరస్తుల్లా చూశారు.. ఇది జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని ఆవేదన. పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి మరీ తమను చితకబాదారని, తమను నేరస్తుల్లా చూశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులని చూడకుండా మగపోలీసులు తమను నెట్టేశారని, తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఆ సమయంలో మహిళా పోలీసులు కూడా లేరని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం సాయంత్రం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనలో విద్యార్థులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా సుమారు 40 మంది గాయపడ్డారు. దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీలో ఆందోళనకారులు నాలుగు బస్సులు, రెండు పోలీసు వాహనాలు దగ్ధం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులపై లాఠీచార్జ్‌ చేశారు. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు జెఎంఐ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడటంతో బలగాలు కూడా క్యాంపస్‌లోకి వెళ్లాయి. ఈ క్రమంలో పోలీసు బలగాలు తమను పట్ల దురుసుగా ప్రవర్తించాయని, కనీసం క్యాంపస్‌ పరిధిలో ఉన్న మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అనుమతించలేదని, తమ లైబ్రరీ, క్యాంటీన్‌ను ధ్వంసం చేశాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో జెఎంఐని వచ్చే నెల 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇంటికి పంపించేశారు.
చదవండి: గదుల్లోకి చొరబడి మరీ కొట్టారు..

మరిన్ని వార్తలు