స్పీకర్‌ అధికారం మాకెందుకు?

31 Jul, 2019 08:03 IST|Sakshi

‘ఎమ్మెల్యేలపై అనర్హత’ అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు స్పీకర్‌కు ఉన్న అధికారాన్ని లాగేసుకునే సాహసం తామెందుకు చేయాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రాజ్యాంగమే ఆ అధికారాన్ని శాసనసభ స్పీకర్‌లకు ఇచ్చిందని తెలిపింది. తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం సహా 11 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ డీఎంకే నేత చక్రపాణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం..‘రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన వారిని అనర్హులుగా ప్రకటించే అధికారం స్పీకర్‌కు ఉంది. ఈ అధికారాన్ని న్యాయస్థానం ఎలా తీసుకుంటుంది’ అని ప్రశ్నించింది.

అనర్హతపై అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయం తీసుకోని పరిస్థితుల్లో కోర్టులే నిర్ణయించాలంటూ పిటిషనర్‌ తరఫున సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబల్‌ వాదించగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది. గత ఏడాది విశ్వాస పరీక్ష సందర్భంగా సీఎం పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పన్నీరుసెల్వంతోపాటు మరో 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని చక్రపాణి తన పిటిషన్‌లో కోరారు. మరోవైపు, ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు రిజర్వేషన్‌ కోటాను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలా వద్దా అనేది వాదనల తర్వాత నిర్ణయిస్తామని మంగళవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ల కోసం ప్రభుత్వం చేసిన 103వ రాజ్యాంగ సవరణను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం మంగళవారం వాదనలు వింది. 

ఇంతకంటే ముఖ్యమైంది మరేదీ లేదు
న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీపై...

దేశవ్యాప్తంగా దిగువ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మించిన ముఖ్య విషయం మరేదీ లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న 24 హైకోర్టులు పోస్టుల భర్తీపై చేపట్టిన చర్యలను సమీక్షిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దేశంలోని వివిధ కోర్టుల్లో 5 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ‘ఇంతకంటే ముఖ్యమైంది మరేదీ లేదు. అవసరమైతే రోజంతా విచారణ జరుపుతాం’ అని ధర్మాసనం పేర్కొంది. యూపీ, మహారాష్ట్ర, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లో ఖాళీల పరిస్థితిని సమీక్షించింది. ఈ సందర్భంగా కొందరు రిజిస్ట్రార్‌ జనరళ్లు మరింత సమయం కావాలని కోరడంతో ధర్మాసనం నిరాకరించింది. గడువులోగా భర్తీ చేయాలని తేల్చింది. యూపీలో 329 మంది అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జీల భర్తీ ప్రక్రియకు పోలీస్‌ వెరిఫికేషన్‌ మాత్రమే మిగిలి ఉందని, మరో మూడు నెలల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుకు ధర్మాసనం ససేమిరా అంది.
  

మరిన్ని వార్తలు