'మేం కాదు.. నాడు మీరే వద్దన్నారు'

3 Aug, 2016 20:34 IST|Sakshi
'మేం కాదు.. నాడు మీరే వద్దన్నారు'

న్యూఢిల్లీ: తాము రాజకీయ పరంగా జీఎస్టీ బిల్లుకు వ్యతిరేకంకాదని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ అన్నారు. అయితే, ఈ బిల్లు విషయంలో తమ ఆందోళనలను, లేవనెత్తే అంశాలను ప్రభుత్వం పట్టించుకోవాలని ఆయన చెప్పారు. బుధవారం రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై ఆయన ప్రసంగిస్తూ పదేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు ప్రస్తావన తెచ్చినప్పుడు అది రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడేస్తుందని అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఆరోపించిందని గుర్తు చేశారు.

అసలు ఆ బిల్లే రాజ్యాంగానికి వ్యతిరేకం అని వ్యాఖ్యానించిందని చెప్పారు. కానీ, ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక ఈ బిల్లుపై ఆలోచనలు మారాయని చెప్పారు. అయితే, పదేళ్ల కిందట కాంగ్రెస్ తీసుకున్న చారిత్రాత్మక అడుగు ఈ జీఎస్టీ బిల్లేనని చెప్పారు. ఇది అత్యంత ముఖ్యమైనదని అన్నారు. దేశ ప్రయోజనాలకోసం కాంగ్రెస్ పార్టీ ఏవైతే అంశాలను ఈ బిల్లు విషయంలో చెబుతుందో వాటని కేంద్రం పట్టించుకుంటే చాలా బాగుంటుందని అన్నారు. ప్రజలపై అదనపు పన్నుల భారం పడటం తమకు ఏమాత్రం ఇష్టం లేదని, పరోక్ష పన్నులు తగ్గు ముఖం పట్టాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు