కొలీజియం..  శిరోధార్యం

13 Sep, 2019 08:28 IST|Sakshi

అకారణ నిర్ణయాలకు తావులేదు: కొలీజియం

కొలీజియం ఆదేశాలు గౌరవించాల్సిందే: అఖిలభారత న్యాయవాదుల సంఘం

 సీజే తహిల్‌ రమణి రాజీనామాపై మరో కోణం

సాక్షి, చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తహిల్‌రమణి రాజీనామా వ్యవహారంలో గురువారం మరో కొత్తకోణం ఆవిష్కృతమైంది. సీజేకు మద్దతుగా గత ఐదురోజులు సంఘీభావాలు కొనసాతుండగా.. గురువారం అందుకు భిన్నమైన వాదనలు చోటుచేసుకోవడంతో రాజీనామా వ్యహారం చిత్రమైన మలుపుతిరిగే అవకాశం ఉంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్ర స్థాయి న్యాయస్థానాల్లో మద్రాసు హైకోర్టు కూడా ఒకటి. 75 మంది న్యాయమూర్తులు కలిగిన మద్రాసు హైకోర్టులో ప్రస్తుతం 4.5 లక్షల కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఈ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంజయ్‌ కిషన్‌ కౌల్‌ గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లిపోయారు. దీంతో ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తహిల్‌ రమణి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గత ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. క్రిమినల్, అప్పీలు కేసులు, మహిళలపై లైంగిక వేధింపులు కేసుల విచారణలో ఆమెకు మంచి పేరుంది. గుజరాత్‌ అల్లర్ల కేసుల నుంచి కొందరు నిర్దోషులుగా బయటపడగా ముంబై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో ఆ తీర్పును రద్దు చేసి వారిలో కొందరికి శిక్షపడేలా చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపుపొందారు.

మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏడాది కాలం పూర్తయిన దశలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్నారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆమె కంటే జూనియర్‌ అయిన ఒక న్యాయమూర్తికి పదోన్నతి కల్పించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం, దీంతో తహిల్‌ రమణి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అసంతృప్తికి లోనై ఉన్న జస్టిస్‌ తహిల్‌ రమణికి సుప్రీంకోర్టు కొలీజియం మరింత మనస్థాపం కలింగించేలా వ్యవహరించినట్లు కొందరు న్యాయవాదులు విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగాయ్, సీనియర్‌ న్యాయమూర్తులైన ఎస్‌కే బాప్డే, ఎన్‌వీ రమణ, అరుణ్‌ మిశ్రా, ఆర్‌ఎఫ్‌ నారిమన్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం సీజే తహిల్‌ రమణిని మేఘాలయా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేలా గతనెల 28వ తేదీన కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానాల్లో ఒకటైన 75 న్యాయమూర్తులు కలిగి ఉన్న మద్రాసు హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తులున్న మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయడంపై ఆమె మరింత కలతచెందినట్లు సమాచారం. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘాలు, సీనియర్‌ న్యాయవాదులు సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మద్రాసు హైకోర్టులో 4.5 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం 1,400 కేసులున్న చిన్నపాటి మేఘాలయా న్యాయస్థానానికి తహిల్‌ రమణిని బదిలీ చేయడాన్ని పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందానికి, ప్రధాన న్యాయమూర్తికి ఆమె లేఖరాయగా వారు తోసిపుచ్చారు. దీంతో తహిల్‌ రమణి తన పదవికి రాజీనామా చేశారు.

అండదండలు
సీజే రాజీనామా చేయడంతో ఆవేదన, ఆందోళన చెందిన తమిళనాడు, పుదుచ్చేరి న్యాయవాదులు బహిరంగంగా ఆమెకు సంఘీభావం తెలిపారు. విధులను బహిష్కరించారు. తాము అండాదండా ఉంటామని పేర్కొన్నారు. మేఘాలయాకు బదిలీ చేయరాదని మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన న్యాయమూర్తుల బృందానికి విన్నవించుకున్నారు. అతిపెద్ద మద్రాసు హైకోర్టు నుంచి అతి చిన్న మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయడం అంటే ‘పనిష్మెంట్‌ ట్రాన్స్‌ఫర్‌’తో సమానమని అన్నారు.

తగిన కారణాలతోనే బదిలీ: కొలీజియం
న్యాయమూర్తులు బదిలీలు, పరిపాలనపరమైన ఇతర వ్యవహారాల్లో నిబద్దతతో వ్యవహరిస్థామని కొలీజియం గురువారం ఢిల్లీలో ప్రకటించింది. తగిన కారణాలతోనే ఎవరినైనా బదిలీ చేస్తాము, అకారణమైన నిర్ణయాలు ఎంతమాత్రం ఉండవని స్పష్టం చేసింది. తమ బదిలీలపై ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేసేందుకు కొలీజియం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

కొలీజియం ఆదేశాలు శిరోధార్యం 
కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని సీజే తహిల్‌ రమణి శిరసావహించాలని పేర్కొంటూ అఖిలభారత న్యాయవాదుల సంఘం ఢిల్లీలో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కొలీజియం గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తహిల్‌ రమణికి మేలుజరిగిందని, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి బాధ్యతల నుంచి తహిల్‌ రమణిని బదిలీ చేయడంలో దురుద్దేశం దాగి ఉందని ఎవరైనా ప్రచారం చేస్తే అది ఎంతమాత్రం సరికాదు. ముంబై హైకోర్టులో అమె మూడుసార్లు తాత్కాలిక న్యాయమూర్తిగా, తరువాత శాశ్వత న్యాయమూర్తిగా, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సులతో నియమితులు కావడాన్ని ఆమె మరువరాదు. కొలిజియం ఆమెపై ఎలాంటి ఆరోపణలు చేయనందున వారు తీసుకున్న నిర్ణయాన్ని ఆమె శిరసావహించాలి. మేఘాలయా హైకోర్టును, దానితో సంబంధాలున్న వ్యక్తులను వేర్వేరుగా చూడకుండా బదిలీ ఉత్తర్వులను అనుసరించి బాధ్యతలు స్వీకరించి ఉంటే బాగుండేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు