ఉగ్రవాదంపై మోదీ మళ్లీ కన్నెర్ర

4 Dec, 2016 12:40 IST|Sakshi
ఉగ్రవాదంపై మోదీ మళ్లీ కన్నెర్ర

అమృత్‌సర్‌: ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి కన్నెర్ర చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాలని అన్నారు. పొరుగు దేశాల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి అఫ్ఘనిస్థాన్‌కు రక్షణ కల్పించే విషయంలో అక్కడి ప్రజల భద్రతకు భరోసా ఇచ్చే విషయంలో తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు. అఫ్ఘనిస్థాన్‌లో శాంతి స్థాపనే  లక్ష్యంగా ఈరోజు సమావేశమైనట్లు ఆయన చెప్పారు. అప్ఘన్‌ లో శాంతికి తాము మద్దతిస్తామని చెప్పడం మాత్రమే కాకుండా అది తీర్మానం రూపంలో ఉండాలని అన్నారు.

ఆదివారం ప్రారంభమైన ఆరవ హార్ట్‌ ఆఫ్‌ ఆసియా సదస్సులో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఆసియా ప్రాంతంలోని భద్రతా పరమైన అంశాలపై ఆయన మాట్లాడారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అందరం కలిసి పోరాడాలని సదస్సుకు వచ్చిన వారందరికీ సూచించారు. ఉగ్రవాద నెట్‌ వర్క్‌ను కూకటి వేళ్లతో పెకలించడం ద్వారా మారణ హోమాన్ని, భయం వ్యాప్తిని నిరోధించిన వారిమవుతామని అన్నారు. అప్ఘనిస్థాన్‌లోని పెచ్చు మీరుతున్న ఉగ్రవాదంపై ఇంకా మౌనంగా ఉంటే అది ఉగ్రవాద నాయకులకు, దాన్ని ప్రోత్సహించేవారికి మరింత బలాన్ని ఇచ్చినట్లవుతుందని అన్నారు. అప్ఘనిస్థాన్‌తో ఇరుగుపొరుగు దేశాలు బలమైన, సానుకూలమైన సంబంధాలు ఏర్పరుచుంటే మొత్తం ఆసియా ప్రాంతాలకు బాగుంటుందని అన్నారు.

అప్ఘన్‌ సోదరులకు, సోదరీ మనులకు అండగా నిలిచే విషయంలో తాము ఇప్పటికే ముందే ఉంటామని మరోసారి స్పష్టం చేశారు. అప్ఘనిస్థాన్‌కు భారతదేశం నుంచి అందే సహాయం ఎప్పటికీ అందుతుందని, అది మరింత రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఒక్క ఉగ్రవాద మూకలపైనే కాకుండా ఉగ్రవాదానికి ఊతమందించేవారిని, ఆర్థిక సహాయం చేసేవారికి వ్యతిరేకంగా కూడా కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన అప్ఘన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతో సమావేశం అయ్యారు. భద్రత, వాణిజ్య పరమైన అంశాలే ఎజెండాగా వారు మాట్లాడారు.

మరిన్ని వార్తలు