శాస్త్రీయంగా దిగుబడులు పెంచాలి

27 Sep, 2016 03:09 IST|Sakshi
శాస్త్రీయంగా దిగుబడులు పెంచాలి

సీఎస్‌ఐఆర్ వేడుకల్లో మోదీ
 
 న్యూఢిల్లీ: క్షీణిస్తోన్న సాగుభూమి, నీటి వనరులను దృష్టిలో పెట్టుకుని పంట దిగుబడి పెంచేందుకు శాస్త్రీయ పరిష్కారాలు అవసరమని ప్రధాని మోదీ అన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీస్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) ప్లాటినం జూబ్లీ సందర్భంగా సోమవారం శాస్త్రవేత్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సాంకేతికత అభివృద్ధి చెందాలన్నారు. ‘ప్రతీ చుక్కకు మరింత పంట అని ఎప్పుడూ చెప్పేవాడిని. అంగుళం నేల, విస్తారమైన పంట నినాదంపైనా ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. 21వ శతాబ్దం సాంకేతిక విప్లవ శతాబ్దమని, భారత అవసరాలు శాస్త్రీయ పరిష్కారంతో తీరాలని, విజ్ఞానంతో సామాన్య ప్రజల్ని అనుసంధానం చేయడం ముఖ్యమని చెప్పారు.  డెంగీ,చికున్ గున్యా, మలేరియా వంటి దోమలతో వ్యాపించే వ్యాధుల నిర్ధారణకు తక్కువ ఖర్చయ్యే వైద్య పరికరాల్ని అభివృద్ధి చేయాలని కోరారు. వైద్య రంగంలో సీఎస్‌ఐఆర్ అనేక ఆవిష్కరణలు అందించిందన్నారు. వైద్యుల కంటే పరికరాలు అనారోగ్యాన్ని సులువుగా కనిపెట్టేస్తాయని చమత్కరించారు.

 యోగా, ఆయుర్వేదంలో పరిశోధనలు చేయాలి
 ప్రపంచమంతా యోగా, ఆయుర్వేదం గురించి మాట్లాడుకుంటోందని, ఆ రంగాల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ కశ్మీర్‌కు చెందిన రైతులతో ప్రధాని కాసేపు ముచ్చటించారు.

 భట్నాగర్ అవార్డుల ప్రకటన
 సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కేంద్రం ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుల్ని ప్రకటించింది. భౌతిక శాస్త్రంలో సుధీర్ కుమార్ వెంపటి, అనంత రామకృష్ణలు, జీవశాస్త్రంలో రిషికేష్ నారాయణ, సువేంద్ర నాథ్ భట్టాచార్య, పార్థసారథి ముఖర్జీ(రసాయన శాస్త్రం)  సునీల్ కుమార్ సింగ్(భూమి, వాతావరణం, అంతరిక్ష శాస్త్రం), అవినాశ్ కుమార్, వెంకట నారాయణ(ఇంజినీరింగ్ సైన్స్) నవీన్ గార్గ్( గణిత శాస్త్రం), నియాజ్ అహ్మద్(వైద్య శాస్త్రం)లు భట్నాగర్ అవార్డుకు ఎంపికయ్యారు. లైఫ్ సెన్సైస్ విభాగంలో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌బీఆర్‌ఐ), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్, అరోమాటిక్ ప్లాంట్స్(సీఐఎంఏపీ, లక్నో)లు సీఎస్‌ఐఆర్ అవార్డుల్ని గెలుచుకున్నాయి.

మరిన్ని వార్తలు