భారత్‌ మా మాతృదేశం అవుతుందను​కున్నాం : రోహింగ్యాలు

22 Dec, 2019 17:15 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా రూపుదాల్చడంతో మయన్మార్‌ నుంచి వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. మయన్మార్‌లో హింస నేపథ్యంలో కట్టుబట్టలతో ఇక్కడికి వలస వచ్చామని, ఇప్పుడు ఇక్కడ కూడా స్థానం లేదంటే మేం ఎక్కడికి వెళ్లాలని వాపోతున్నారు. దేశ రాజధానిలోని క్యాంపుల్లో తలదాచుకుంటున్న రోహింగ్యా ముస్లింలను మీడియా పలకరించింది. 18 ఏళ్ల రహీమా మాట్లాడుతూ.. ‘ఆరు సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌కు వలస వచ్చాం​. ఇద్దరు సోదరులతో కలిసి దారుణ పరిస్థితుల నుంచి బయటపడ్డాం. ఇక్కడ  ప్రతీరోజు ఉదయం లేచినప్పుడు బతికే ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేవాళ్లం. భారత్‌లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మమ్మల్ని వెనక్కి పంపేస్తామంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే మేం చావును కొనితెచ్చుకున్నట్టే’నని వివరించింది.

భారతదేశంలో రోహింగ్యాల సంఖ్య దాదాపు 40 వేలు ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు తలదాచుకున్నారు. వీరంతా ఐక్యరాజ్యసమితి ద్వారా జారీ చేయబడిన శరణార్థి కార్డులు కలిగి ఉన్నారు.

22 ఏళ్ల సలాం మాట్లాడుతూ.. ‘ఒక రోజు ఆర్మీవాళ్లు మా ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులందరినీ చంపేశారు. తర్వాత చంపేది నిన్నేనంటూ బెదిరించారు. ఈ ఘటనతో మా ఊళ్లో ఉన్న 35 మందితో కలిసి కట్టుబట్టలతో బంగ్లాదేశ్‌కి వచ్చాం. అక్కడ నాలుగు నెలలపాటు రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ ఇండియాకు వచ్చాం. మాకు మయన్మార్‌కు తిరిగి వెళ్లాలని లేదు. అక్కడికి వెళ్తే మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారు. కానీ, ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మమ్మల్ని బలవంతంగా వెళ్లగొట్టేలా కనిపిస్తున్నాయం’టూ వివరించాడు.

ఈ నెల ప్రారంభంలో హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంటులో మాట్లాడుతూ రోహింగ్యాలకు పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. రోహింగ్యాలను ప్రపంచంలోనే తమకంటూ దేశం లేని అతిపెద్ద మైనార్టీ తెగగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.

మరో రోహింగ్యా కుల్సుమ్‌ మాట్లాడుతూ.. ‘ప్రత్యేక దేశమంటూ లేని మేము మళ్లీ అక్కడికి(మయన్మార్‌) వెళ్తే అది మాకు చాలా ప్రమాదకరం. ఇండియా నాకు, నా పిల్లలకు సురక్షితంగా ఉంది. మమ్మల్ని తిరిగి పంపిస్తారనే ఆలోచనే చాలా భయంకరంగా అనిపిస్తోంద’ని వెల్లడించాడు. కాగా, మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రంలోని రోహింగ్యాలు తమ దేశ పౌరులు కాదని, వారంతా బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన తెగ అంటూ ఆ దేశం వారికి పౌరసత్వం నిరాకరించింది. ఈ నేపథ్యంలో స్థానికంగా నెలకొన్న హింసాత్మక పరిస్థితుల వల్ల రోహింగ్యాలు వలస బాట పట్టారు.  

మరిన్ని వార్తలు