అనుమ‌తి ఇస్తే ఆర్మీలో చేర‌తా..

6 May, 2020 08:27 IST|Sakshi

జైపూర్‌: భార‌త్ కోసం ర‌క్తం చిందించి భ‌ర‌త‌మాత‌కు వీర‌తిల‌కం దిద్దిన సైనికుడు క‌ల్న‌ల్ అశుతోష్ శ‌ర్మ‌. ఆదివారం జ‌మ్మూ కశ్మీర్‌లోని హంద్వారాలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఉగ్రమూకలు దొంగదెబ్బ తీయడంతో కల్నల్ స‌హా ఇద్దరు మేజర్‌ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు ఒక పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నేలకొరిగిన విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వారం  జైపూర్‌లోని మిలిట‌రీ స్టేష‌న్‌లో క‌ల్న‌ల్ ఆశుతోష్ శ‌ర్మ అంత్య‌క్రియ‌లు సైనిక వంద‌నంతో ముగిశాయి. ఈ సంద‌ర్భంగా క‌ల్న‌ల్‌ భార్య ప‌ల్ల‌వి శ‌ర్మ మాట్లాడుతూ.. త‌న‌ భ‌ర్త పోరాటం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, క‌న్నీళ్లు రాల్చ‌బోమ‌ని పేర్కొన్నారు. అంతేకాకుండా తాను సైతం భార‌తావ‌నిని ర‌క్షించేందుకు పాటుప‌డ‌తానంటున్నారు.  (కల్నల్‌ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం)

"నేను ఆర్మీలో చేరాల‌నుకున్నాను, కానీ అది కుద‌ర‌లేదు. ఇప్పుడు నా వ‌య‌స్సు అనుకూలిస్తే, మంత్రిత్వ శాఖ అనుమ‌తి ఇస్తే యూనిఫాం ధ‌రించాల‌నుకుంటున్నాను" అని ప‌ల్ల‌వి శ‌ర్మ త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. అటు ఆమె ప‌ద‌కొండేళ్ల కూతురు త‌మ‌న్నా కూడా పెద్ద‌య్యాక‌ సైన్యంలో చేరాల‌నుకుంటోంద‌ని చెప్పుకొచ్చారు. రెండు రోజులుగా త‌న క‌ళ్ల ముందు జ‌రుగుతున్న‌న వాటిని నిశితంగా ప‌రిశీలిస్తున్న కూతురుకు ఇప్పుడిప్పుడే సైన్యంలో చేరాల‌న్న కోరిక బ‌ల‌ప‌డుతోంద‌న్నారు. ఆమె కోరిక‌కు తాను అడ్డు చెప్ప‌న‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ముందు త‌ను బాధ్య‌తాయుత పౌరురాలిగా ఎద‌గ‌డం ముఖ్య‌మ‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. (13సార్లు ప్రయత్నించి సైన్యంలో చేరిన ఆయన...)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు