విభజన హామీలు త్వరలో నెరవేరుస్తాం..

14 Mar, 2015 02:44 IST|Sakshi
విభజన హామీలు త్వరలో నెరవేరుస్తాం..

న్యూఢిల్లీ: కేంద్ర సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్‌లోని సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నేతృత్వంలో పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రులు పలు అంశాలపై చర్చించారు. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని హామీలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈ చట్టం ద్వారా ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చేందుకు కృషిచేస్తామని మంత్రులు వెంకయ్యనాయుడికి హామీ ఇచ్చారు.

ఈ సమావేశానికి.. సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కారీ, రాంవిలాస్ పాశ్వాన్, సదానందగౌడ, రవిశంకర్ ప్రసాద్, జేపీ నడ్డా, బీరేంద్ర సింగ్ చౌదరి, సురేశ్‌ప్రభు, అనంత్ కుమార్, హర్షవర్ధన్, జుయల్ ఓరం, అనంత్ గీతే, నజ్మా హెప్తుల్లా, స్మృతీ ఇరానీ, అశోక్ గజపతి రాజు, పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, డాక్టర్ జితేంద్ర సింగ్, వై.ఎస్.చౌదరి తదితరులు హాజరయ్యారు. సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్‌లోని అంశాలతోపాటు భూసేకరణ సవరణ చట్టం వల్ల ఉపయోగాలను, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా రాష్ట్రాలకు పెరిగిన పన్నుల వాటా తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వెంకయ్యనాయుడు మంత్రులకు సూచించారు. మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు పార్లమెంట్‌కు సెలవులు ఉన్నందున ఆ సమయంలో వీటిపై దృష్టిపెట్టాలని సూచించారు.
 విశాఖ జోన్ పరిశీలనలో ఉంది: సురేశ్ ప్రభు
 విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు పరిశీలనలో ఉందని ఈ సందర్భంగా రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇచ్చిన ప్రతిపాదనలన్నింటినీ పూర్తిచేశామని, త్వరలోనే ఏపీ, తెలంగాణల్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి.. వెంకయ్యకు హామీ ఇచ్చారు.

 

తిరుపతిలో ఐఐటీ కోసం ప్రతిపాదించిన స్థలానికి అనుమతి ఇచ్చామని హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతి చెప్పారు. ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ సంస్థల శంకుస్థాపనకు తాను ఏపీకి వెళుతున్నానని, ఇతర సంస్థల పనులు కూడా పురోగతిలో ఉన్నాయని వివరించారు. ఏపీలో ఎయిమ్స్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి జేపీ నడ్డా వివరించారు. ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ మాట్లాడుతూ.. రామగుండం ఫెర్టిలైజర్స్ యూనిట్‌ను పునరుద్ధరించేందుకు ఆయా సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయని వివరించారు.
 కడప స్టీలు ప్లాంటుపై అధ్యయనం..
 కడపలో స్టీలు ప్లాంటు ఏర్పాటుపై అధ్యయనం జరుగుతోందని గనులు, ఉక్కు శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెంకయ్యకు వివరించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయితే పెట్రోలియం వర్సిటీ పనులు ప్రారంభిస్తామని పెట్రోలియం, సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివరించారు. విద్యుత్తు, బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ కేటాయింపులు జరపగా మిగిలిన విద్యుత్తును ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తామన్నారు.

అలాగే తెలంగాణలో 800 మెగావాట్ల చొప్పున రెండు విద్యుత్తు ప్లాంట్లను తొలివిడతలో రామగుండం ప్రాజెక్టు పరిధిలోని ఎంజీఆర్ ప్రాంతంలో అభివృద్ధిపరుస్తామని వివరించారు. రెండు రాష్ట్రాలకు హైకోర్టు ఏర్పాటు విషయంలో కేంద్రం సిద్ధంగా ఉందని, ఉమ్మడి హైకోర్టు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని అన్నారు. సమావేశంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు