మృతుల సంఖ్య కచ్చితంగా తెలియదు: బహుగుణ

30 Jun, 2013 15:32 IST|Sakshi
మృతుల సంఖ్య కచ్చితంగా తెలియదు: బహుగుణ

ఉత్తరాఖండ్ వరదల్లో ఎంత మంది మృత్యువాత పడ్డారనే విషయం కచ్చితంగా తెలియదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ అన్నారు. మృతులు ఎంత అనేది స్పష్టంగా చెప్పలేమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  చనిపోయిన వారి సంఖ్య వందల్లోంచి నుంచి వేలల్లోకి ఎగబాకవచ్చని అభిప్రాయపడ్డారు. వరదల్లో ఎంతో మంది కొట్టుకుపోవడం లేదా బురదలో కూరుపోయి మృతి చెందడంతో మృతుల సంఖ్యపై స్పష్టత రావడం లేదన్నారు.

వరదల్లో చనిపోయినవారు వెయ్యి కన్నా తక్కువే ఉన్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గోవింద్‌సింగ్ కుంజ్వాల్ మాత్రం మృతుల సంఖ్య 10 వేలకు పైనే ఉండొచ్చని స్పష్టంచేశారు. తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి, ఆ విలయాన్ని ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నదాన్ని బట్టి వారి సంఖ్య 10 వేలకు పైనే ఉండొచ్చని అనిపిస్తోందని అన్నారు. మట్టిదిబ్బలు, బురదలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు కూరుకుపోయి ఉన్నాయని చెప్పారు.  మరోవైపు శుక్రవారం రాత్రి వరకున్న సమాచారం మేరకు మృతుల సంఖ్య 900గా ఉందని, ఇప్పటిదాకా 1.05 లక్షల మందిని కాపాడినట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ముంబైలో చెప్పారు.

వరద సహాయక చర్యల్లో తమ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలను విజయ్ బహుగుణ తోసిపుచ్చారు.  విపత్తు సంభవించిన వెంటనే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన వరద బాధితులకు తక్షణమే పరిహారం అందేలా చూస్తామని చెప్పారు. మిగతా రాష్ట్రాల వారు పరిహారం కోసం తమ ప్రభుత్వాలను కోరాలన్నారు. మృతదేహాల అంత్యక్రియలను పర్యవేక్షించేందుకు డీఐజీ స్థాయి అధికారి(గంజియాల్)ను నియమించామని చెప్పారు. భవనాల్లో చిక్కుకున్న మృతదేహాలను జేసీబీల సహాయంతో వెలికి తీస్తున్నామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు