విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చుతాం

3 Aug, 2019 21:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 109 మంది విద్యార్థులను క్షేమంగా వారి స్వస్థలాలకు చేర్చుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో చదువుతున్న 5000 మంది విద్యార్థులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధికారులతో,  రైల్వే, విమానయాన శాఖ అధికారులతో కిషన్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

శనివారం తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, సోయం బాబూరావు,  ధర్మపురి అరవింద్‌లతో ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుంటూ.. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అధికారులతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులను క్షేమంగా స్వస్థలాకు పంపించే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు.   తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థుల తరలింపు విషయంలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్‌, బండి సంజయ్, సోయం బాపురావులు ప్రతి క్షణం కిషన్ రెడ్డికి సహాయంగా ఉంటున్నారు.

మరిన్ని వార్తలు