చండీపూర్‌కు అరుదైన ఘనత

8 Nov, 2017 16:19 IST|Sakshi

బాలాసోర్‌(ఒడిశా): చండీపూర్‌లోని క్షిపణి ప్రయోగకేంద్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇక్కడి బీచ్‌లో దేశంలోనే మొట్టమొదటి ఆయుధ ప్రదర్శనశాల ఏర్పాటైంది. భారత నావికా దళం, వైమానిక దళాలు వినియోగించిన ప్రముఖ ఆయుధ వ్యవస్థలను ప్రజల సందర్శనార్థం ఇందులో ఉంచారు. డిఫెన్స్‌ రీసెర్చి, డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో) డాక్టర్‌ ఎస్‌. క్రిస్టొఫర్‌ మంగళవారం దీనిని ప్రారంభించారు. మొత్తం 14 రకాల ఆయుధాలను ప్రస్తుతం ప్రదర్శిస్తున్నామని, భవిష్యత్తులో మరికొన్ని ఇందులో ఉంచనున్నట్టు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి సైన్యం ఎలాంటి ఆయుధాలను, ఆయుధ వ్యవస్థలను వాడుతుందనే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించటానికి ఇది ఉపయోగపడుతుందని క్రిస్టొఫర్‌ తెలిపారు. మనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటి చెప్పటానికి.. ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు. చండీపూర్‌లో సైన్యం వినియోగించే ట్యాంకులు, క్షిపణులు, ఫీల్డ్‌గన్స్‌, మోర్టార్లు తదితరాలను పరీక్షిస్తుంటారు. 

ఈ ప్రదర్శనలో 1971 వ సంవత్సరంలో పాక్‌తో జరిగిన యుద్ధంలో కీలక పాత్ర పోషించిన వైజయంత ట్యాంక్‌ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశం బంకర్లను, సైన్యాన్ని నిలువరించటం ఈ ట్యాంక్‌ దీని ప్రత్యేకత. దీనితో పాటు డబ్ల్యూఎం-18 రకం రాకెట్‌ లాంఛర్‌, 105 మిమీ ఫీల్డ్‌గన్‌, 122 మిమీ బీఎం-21 రాకెట్‌ లాంఛర్‌, 57 మిమీ యాంటీ ట్యాంక్‌ గన్‌, 40 ఎంఎం లైట్‌గన్‌ తదితరాలను కూడా ప్రదర్శనలో ఉంచారు.

>
మరిన్ని వార్తలు