ఇంతకు ‘లోక్‌పాల్‌’ వస్తుందా?

19 Mar, 2019 16:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌పాల్, లోకాయుక్త బిల్లును భారత పార్లమెంట్‌ ఆమోదించి ఐదేళ్ల అనంతరం నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలి లోక్‌పాల్‌గా సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ పినాకీ చంద్ర ఘోష్‌ను ఆదివారం నియమిస్తూ రాష్ట్రపతికి సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. ఇంకా ఈ లోక్‌పాల్‌ కమిటీలోకి ఎనిమిది మంది సభ్యులను తీసుకోవాల్సి ఉంది. కమిటీలో షెడ్యూల్డ్‌ తెగలు, షెడ్యూల్డ్‌ కులాలు, బీసీలు, మైనారిటీలు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది.

ఈ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించిన నేపథ్యంలోనే దేశంలో నల్ల డబ్బును నిర్మూలిస్తానని, అవినీతిని అంతం చేస్తానని తెగ ప్రచారం చేయడం ద్వారా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. కేంద్ర స్థాయిలో వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తారని సామాజిక కార్యకర్తలు ఆశించారు. తొలి లోక్‌పాల్‌ను నియమించడానికి నరేంద్ర మోదీకి ఐదేళ్లు పట్టింది. అదీ నాడు లోక్‌పాల్‌ కోసం ఉద్యమించిన అన్నా హజారే, లోక్‌పాల్‌ను నియమించాలంటూ మళ్లీ నిరశనకు దిగడం, మరోపక్క ఫిబ్రవరి నెలలోగా లోక్‌పాల్‌ను నియమించాలంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం పరిణామాల మధ్య మోదీ నాయకత్వంలోని ఎంపిక కమిటీ ఎట్టకేలకు తొలి లోక్‌పాల్‌ను సిఫార్సు చేసింది. అదీ పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూలు ప్రకటించాక. మిగతా ఎనిమిది మంది సభ్యుల నియామకం ఎన్నికల్లోగా జరుగుతుందన్న నమ్మకం లేదు. సుప్రీం కోర్టు విధించిన గడువుకాలం ముగిసిన తర్వాత లోక్‌పాల్‌ను ఖరారు చేసినందున ఆయన నియామకం చెల్లుతుందన్న గ్యారంటీ లేదు.

అవినీతి జరగకుండా చూసేందుకు ‘నేను కాపలాదారుడిని’ అని ప్రచారం చేసుకుంటున్న మోదీకి, మరింత ఎన్నికల ప్రచారం కోసం లోక్‌పాల్‌ నియామకం పనికి వస్తుందేమో! ఎంపిక కమిటీలో ప్రతిపక్షం మాటకు ఏం మాత్రం విలువ లేనప్పుడు లోక్‌పాల్‌ కమిటీ వల్ల ప్రభుత్వంలో అవినీతిని అరికట్టవచ్చని భావించడం అత్యాశే కావచ్చు! గుజరాత్‌ ముఖ్యమంత్రిగా లోక్‌పాల్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన నరేంద్ర మోదీ ‘లోక్‌పాల్‌ వ్యవస్థను తీసుకొస్తారనుకోవడం పొరపాటే కావచ్చు!

1968లోనే లోక్‌పాల్‌ గురించి చర్చ
ప్రభుత్వ స్థాయిలో అవినీతిని అరికట్టేందుకు ఓ వ్యవస్థ కావాలంటూ 1968లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేయడంతో నాలుగవ లోక్‌సభలో లోక్‌పాల్‌ వ్యవస్థ గురించి మొదటిసారి చర్చకు వచ్చింది. లోక్‌పాల్‌ వ్యవస్థకు భయపడడం వల్ల ప్రధాని సహా కేబినెట్‌ మంత్రులు తమ విధులను సక్రమంగా నిర్వహించలేరన్న వాదనతో దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత అనేక సార్లు ఈ ప్రతిపాదన వచ్చినా అదే వాదనతో దాన్ని పక్కన పెడుతూ వచ్చారు. దేశంలో అవినీతి అరికట్టేందుకు లోక్‌పాల్‌ వ్యవస్థ కావాలంటూ 2011లో అన్నా హజారే, నేటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్, ఇతర సామాజిక కార్యకర్తలు ఉద్యమించడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో లోక్‌పాల్‌ బిల్లుకు అంగీకరించింది. బిల్లును తీసుకరావడానకి రెండేళ్లు పట్టింది. 2013లో తీసుకొచ్చినప్పటికీ బిల్లులో మార్పులు, చేర్పుల కోసం పార్లమెంట్‌ సెలెక్ట్‌ కమిటీలు, స్థాయి సంఘాల చుట్టూ తిప్పడంతో 2014, జనవరి 1వ తేదీన చట్టరూపం దాల్చింది.

లోక్‌పాల్‌ నియామకంపై జరుగుతున్న జాప్యానికి మూడున్నర ఏళ్లపాటు మౌనం వహించిన రాహుల్‌ గాంధీ 2018, జనవరి నెల నుంచి నరేంద్ర మోదీపై దాడి చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా ఈ విషయమై నిలదీస్తూ వచ్చారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు